Monday, November 26, 2012

కాళిదాసు - మేఘ సందేశం


చిన్నప్పుడు మేఘ సందేశం సినిమా చూసి అదే కాళిదాసు వ్రాసినది అన్న అపోహలో ఉండేదానిని. తరువాత రెండూ వేరు వేరని, ఇదొక విరహ కావ్యం అని తెలిసింది. విరహం నాకెందుకో అంతగా నచ్చదు. కానీ కాళిదాసు విరహ కావ్యం చదివాక విరహంలో కూడా ఇంత అందం, ఆనందం ఉంటాయని తెలుసుకున్నాను. నవరసాలలో మొట్ట మొదటి స్థానం శృంగారానికే దక్కింది కనుక ముందుగా కాళిదాసు శృంగార రచనలని నాకు అర్థమయినంతలో పరిచయం చేస్తున్నాను. ఆ ప్రకారంగా అభిజ్ఞాన శాకుంతలం తరువాత స్థానం మేఘ సందేశానికి ఇచ్చాను. ఈ మేఘ సందేశం ఒక "ఖండ కావ్యం". ఖండ కావ్యం భవేద్కావ్యం ఏక దేశాను సారిచ అన్నారు. ఒక కథతో సంబంధం లేకుండా ఏదో ఒక భాగాన్ని లేదా ఘట్టాన్ని తీసుకుని వివరించడమే ఖండ కావ్య లక్షణం. ఈ మేఘ సందేశంలో పూర్వ మేఘం (63 శ్లోకాలు), ఉత్తర మేఘం (52 శ్లోకాలు) అని రెండే సర్గలు ఉన్నాయి.  
 
కాళిదాసు రచించిన కావ్యాలకి ఒక ప్రత్యేకత ఉంది. కాళిదాసు పుట్టుకతోనే పండితుడు కాదనీ, పెళ్ళయ్యాకే అమ్మవారి (కాళికా దేవి) అనుగ్రహం వలన పండితుడయ్యాడనీ అందరికీ తెలిసినదే. అయితే పెళ్ళయిన వెంటనే కాళిదాసు భార్య "వాగస్తి కశ్చిత్?" (వాక్కు ఏదన్నా నీకుందా?) అని అడుగుతుంది. ఈయన పండితుడయిన తరువాత, ఈ వాగస్తి కశ్చిత్ లో ఉన్న మూడు పదాలనీ (వాక్, అస్తి, కశ్చిత్) తీసుకునీ ఒక్కో పదంతో మొదలయ్యేట్టుగా ఒక్కో కావ్యాన్ని (వాక్కుతో మొదలుపెట్టిన మహా కావ్యం రఘువంశం, అస్తి తో మొదలుపెట్టిన మహా కావ్యం కుమార సంభవం మరియు కశ్చిత్ తో మొదలుపెట్టిన ఖండ కావ్యం మేఘ సందేశం) వ్రాశాడు. ఆ ప్రకారంగా ఇందులోని మొట్టమొదటి శ్లోకం:
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః ।
యక్షశ్చక్రే  జనక తనయా స్నాన పుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు ॥

అంటే తన విధులలో అశ్రద్ధ వహించటం వలన యజమాని ఆగ్రహానికి గురయ్యి, తన విధుల నుండి తొలగించబడి, తన శక్తులన్నీ కోల్పోయి, యేడాది కాలం కాంతా (భార్య) వియోగంతో గడపవలననే శాపాన్ని పొందిన యక్షుడు, జనకుని కూతురు అయినటువంటి సీతా దేవి స్నానం చేయటం వలన పవిత్రంగా మారిన నీరు కలిగినటువంటి, దట్టమయిన నీడనిచ్చే చెట్లు కలిగినటువంటి రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు.

ఈ శ్లోకంతో నాయకుడయిన యక్షుని పరిచయం జరిగింది. దానికి రెండు విశేషణాలు వాడాడు. అవే స్వాధికారాత్ ప్రమత్తః, అస్తంగమిత మహిమ. దీని ఆధారంగా కాళిదాసు విధి నిర్వహణే ప్రధాన కర్తవ్యం అని చెప్తున్నాడు అనిపిస్తుంది. చేయవలసిన పని సరిగ్గా చేయకపోవటం వలన యక్షునికి కలిగిన అనర్థాలు ఉద్యోగం మరియు మహిమలు కోల్పోవటం, తద్వారా కాంతా వియోగం పొందటం. మనకి ధర్మార్థకామాలలో కూడా మొదటిది ధర్మ నిర్వహణే కదా! అది సరిగ్గా చేయకపోతే అన్నిటికీ దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు అని చెప్పాడు కానీ అదెక్కడుందో రెండు విశేషణాలతో చెప్పకనే చెప్పాడు. అవే జనక తనయా స్నాన పుణ్యోదకేషు అనగా సీతాదేవి స్నానం చేయటం వలన పవిత్రమయిన నీరు, స్నిగ్ధచ్ఛాయాతరుషు అనగా ఎక్కువగా నీడనిచ్చే చెట్లు. వీటి ఆధారంగా తెలిసేది ఏమిటంటే సీతాదేవి వనవాసం చేసిన చోటు అని. అదే చిత్రకూట పర్వతం. ఇటువంటి ఎన్నో రసవత్తరమయిన శ్లోకాలతో ఆద్యంతం ఆకట్టుకున్న అద్భుత కావ్యం మేఘ సందేశం.

అరణ్యంలో విరహంతో ఉన్న యక్షునికి (యక్షులు సాధారణంగా కాముకులు కనుక వారికి కాంతా వియోగం భరించలేనటువంటిది) మేఘుడు కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఏమీ ఆలోచించకుండా మేఘునితో అలకాపురి(యక్షుల నివాసం)లో ఉన్న తన భార్యకి సందేశాన్ని పంపాలి అనుకుంటాడు. శ్రీరాముడు సీతకి ఆంజనేయస్వామి ద్వారా, పాండవులు కౌరవులకి శ్రీ కృష్ణుని ద్వారా, నలోపాఖ్యానంలో దమయంతికి హంస ద్వారా, సందేశాలు పంపటం జరిగాయి. కానీ ఇక్కడ యక్షుడు - పొగ, వెలుతురు, నీరు, గాలి కలిసినటువంటి మేఘంతో (ప్రాణం లేని దానితో) సందేశం పంపబోతున్నాడు. ఆ మాత్రం కూడా కాళిదాసుకి తెలియదు అని జనం భావించకుండానే, కామార్తులకు (కామముతో ఉన్న వాడికి) అంత ఆలోచన ఎక్కడిది? అని తన కావ్యౌచిత్యాన్ని సమర్ధించుకున్నాడు (పూర్వ మేఘం, నాల్గవ శ్లోకంలో).

పూర్వ మేఘంలో మేఘానికి మార్గ నిర్దేశం చేస్తాడు. ఆ ప్రకారంగా, చిత్రకూట పర్వతం (ప్రస్తుతం దీనిని మధ్యప్రదేశ్ లోని రామ్ గఢ్ అంటారు) మీద బయలుదేరిన మేఘం, మాల పర్వతం (ప్రస్తుతం దీనిని ఛత్తీస్ గఢ్ అంటారు) మీదుగా ఆమ్రకూట పర్వతం (నర్మదా లేదా రేవా నదీ జన్మస్థానం) వెళ్ళి, అక్కడనుండీ దశార్ణ దేశ (మాళవ దేశ పూర్వ భాగాన్ని దశార్ణ దేశం అంటారు) రాజధాని అయినటువంటి విదిశా (ప్రస్తుతం దీనిని భిలాసా అంటారు) నగరానికి వెళ్ళి వేత్రవతీ (వింధ్య పర్వతాలకి ఉత్తర భాగంలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "బేత్ వా" అని పిలుస్తారు) నది అందాలని ఆస్వాదిస్తూ, కొంచెం చుట్టు తిరుగు అయినా ఉజ్జయిని (మాళవ దేశ రాజధాని. దీనినే అవంతి అని కూడా అంటారు) వెళ్ళి తప్పనిసరిగా (కాళిదాసుకి ఆ ఊరి మీదా, శివుని మీదా ఉన్న మమకారంతో ఇది చేర్చాడు అనిపిస్తుంది) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటయిన మహాకాలుని దర్శనం (సాయంకాల సమయంలో) చేసుకుని, శిప్రా (ఉజ్జయినిలో ప్రవహించే నది) నదికి ఉపనదులయిన గంధవతి, గంభీర నదుల వద్ద సేద తీరి, దేవగిరి (ప్రస్తుతం దీనిని దౌలతాబాద్ అంటారు) పర్వతం వద్ద నివాసముండే శరవణభవుడయిన కుమారస్వామిని దర్శించుకుని, అక్కడ ప్రవహించే చర్మణ్వతి (వింధ్య పర్వతాలకి వాయువ్య దిశలో ఉద్భవించిన ఈ నదిని ప్రస్తుతం "చంబల్" అని పిలుస్తారు) నదిని దాటుకుంటూ, దశపురం (రంతిదేవుని రాజధాని నగరం), బ్రహ్మావర్తం (సరస్వతీ, దృషద్వతీ నదుల మధ్యన ఉన్న ప్రదేశం), కురుక్షేత్రం (మహా భారత యుద్ధం జరిగిన చోటు), కనఖలం (హరిద్వార్ వద్ద ఉన్న క్షేత్రం, ఇక్కడ గంగానది ప్రవహిస్తుంది), హిమవత్పర్వతం మీదుగా కైలాసం చేరాక, ఆ ప్రక్కనే ఉన్న అలకానగరం (మా అనగా యక్షుల నివాసం) వెళ్ళాలి.

ఉత్తర మేఘంలో అలకానగారాన్ని వివరించి, తన ఇంటికి దారి చెప్పి, తన భార్య గుర్తులు చెప్పి, వారిరువురికి (యక్షునికీ, తన భార్యకీ) మాత్రమే తెలిసిన కొన్ని సంగతులను చెప్పి (యక్షుని భార్యకి ఈ మేఘుడు నిజంగా యక్షుడు పంపిన వాడే అని నమ్మకం కలిగించటం కోసం), తన గురించి బాధ పడవద్దనీ, తాను త్వరగా వచ్చేస్తానని చెప్పమని మేఘుడిని రకరకాలుగా పొగిడి (తన పని జరగడం కోసం) మరీ పంపిస్తాడు. తీరా చూస్తే, మేఘం ఆ అలకానగరం వెళ్ళేసరికి యక్షుడే తన సంవత్సర కాలం పూర్తి చేసుకుని తన భార్యను చేరుకుంటాడు.

నాయకులు నాలుగు రకాలు. వారినే చతుర్విధ నాయకులు అంటారు. ధీరోదాత్తుడు (వీరత్వం అధికంగా ఉండి ఆవేశం లేకుండా ఆలోచన కలవాడు ఉదా: శ్రీ రాముడు), ధీరోద్ధతుడు (వీరత్వం ఎక్కువగా ఉండి ఆలోచన ఏ మాత్రం లేనివాడు ఉదా: భీముడు), ధీర లలితుడు (వీరత్వం, లాలిత్యం సమపాళ్ళలో కలిసిన ప్రేమ స్వరూపుడు ఉదా: శ్రీ కృష్ణుడు), ధీర శాంతుడు (శాంతాన్ని అధికంగా కలిగిన వీరుడు ఉదా: గౌతమ బుద్ధుడు). కాళిదాసు తన రచనలలో నాయకుడిని ఎప్పుడూ ధీరోదాత్తునిగానే మలుచుకుంటాడు. శాకుంతలంలో అదే జరిగి అభిజ్ఞాన శాకుంతలం అయ్యింది కదా! ఈ మేఘ సందేశంలో కూడా నాయకుడైన యక్షుని ధీరోదాత్తునిగానే చూపాడు (పూర్వ మేఘం, మూడవ శ్లోకంలో).

శృంగార నాయికలు ఎనిమిది రకాలు. వారినే అష్టవిధ శృంగార నాయికలు అంటారు. వారిలో నలుగురిని ఎన్నుకుని, ఒక్కొక్కరిగా ఈ కావ్యంలో పూర్వమేఘంలో పరిచయం చేశాడు కాళిదాసు. 

త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాన్తాః
ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వ సన్త్యః ।
కః సన్నద్ధే విరహవిధురా త్వయ్యుపేక్షేత జాయాం
న స్యాదన్యోఽప్యహమివ జనోయః పరాధీనవృత్తిః ॥
అంటూ ముందుగా పథికవనితాః అనగా ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక గురించి చెప్పాడు. భర్త దూరంగా (పని మీద ఎక్కడికైనా వెళ్ళినా, దేశాంతరం వెళ్ళినా) ఉన్నప్పుడు తన గురించి ఆలోచిస్తూ విరహంతో ఉండే స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. మేఘుడు కామ ప్రకోపన చేసేవాడు. అసలే విరహంతో ఉండే స్త్రీలు నీ (మేఘుని) రాకతో, తమ భర్తతో కలవాలన్న కోరిక పెరిగి, భర్త కూడా అదే కాంక్షతో వస్తాడు అన్న ఆశతో తమ ఫాల భాగం మీద పడుతున్న ముంగురులను పైకి ఎత్తి నిన్ను చూస్తారు. అటువంటి స్త్రీని విడిచి అశక్తుడు, అస్వతంత్రుడు, పరాధీనుడు అయిన మగవాడు తప్ప మరెవ్వరూ ఉండలేరు అంటాడు. ప్రస్తుతం యక్షుని పరిస్థితి అదే కనుక ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తూ మేఘుని వెళ్ళి తన క్షేమ సమాచారం తెలియ చేయమంటాడు. దీనికి సమర్ధింపుగా ఉత్తర మేఘంలో 21, 22, 23, 24, 25 శ్లోకాలలో యక్షుని భార్యలో ఉన్న ప్రోషిత భర్తృక లక్షణాలన్నీ విశదీకరిస్తాడు. నాకెందుకో కాళిదాసుకి ఈ ప్రోషిత భర్తృక అంటే ప్రత్యేక అభిమానం అనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలని ప్రోషిత భర్తృక (దూర్వాస మహాముని శాపానికి కారణమయినప్పుడు) గానే చూపిస్తాడు.  

గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్రనక్తం
రుద్ధాలోకే నరపతి పథే సూచి భేద్యై, స్తమోభిః ।
సౌదామన్యా, కనక నికషస్నిగ్ధయా దర్శయోర్వీం
తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః ॥

అంటూ రమణవసతిం గచ్ఛన్తీనాం అనగా అభిసారిక గురించి చెప్పాడు. అందంగా అలంకరించుకుని, ప్రియుని వద్దకు తాను వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ఉజ్జయనిలోని స్త్రీలను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకంలో అక్కడి అభిసారికలు (స్త్రీలు) రాత్రిపూట ప్రియుని ఆవాసానికి బయలుదేరతారు కనుక ఆ సమయంలో నువ్వు (మేఘుడు) మెఱుపులతో దారి చూపు కానీ ఉరుముతూ వాన పడి వారిని భయపెట్టకు. వారసలే మిక్కిలి భయస్తులు అని మేఘుడిని హెచ్చరిస్తూ స్త్రీలతో సున్నితత్వం వహించాలని చెప్తాడు. పూర్వ మేఘంలో ఉజ్జయినిలోని (కాళిదాసు నివాస స్థలం) అభిసారికలు ప్రియుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో చెప్పిన కాళిదాసు ఉత్తర మేఘంలో (తొమ్మిదవ శ్లోకంలో) అలకాపురిలోని (యక్షుని నివాస స్థలం) అభిసారికలు తమ ప్రియుని వద్ద నుండీ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. దీని ద్వారా కాళిదాసు పురుషుల ఏక పత్నీత్వం, స్త్రీల పాతివ్రత్యం ఇష్టాధీనమే కానీ కృత్రిమం కాదు అని చెప్తున్నాడనిపిస్తుంది. మన నాయకుడయిన యక్షుడు ఏకపత్నీ వ్రతుడు, ముందుగా చెప్పుకున్నట్టు ధీరోదాత్తుడు కాకపోతే తన భార్యకి మేఘుడిని బ్రతిమాలుకుని మరీ సందేశం పంపవలసిన అవసరం లేదు కదా! అలా మన నాయకుని ధీరోదాత్త లక్షణం మళ్ళీ చూపాడు.

తస్మిన్కాలే నయన సలిలం యోషితాం ఖణ్డితానాం
శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మభానోస్త్య జాశు ।
ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్ఫాభ్యసూయః ॥

అంటూ ఖణ్డితానాం అనగా ఖండిత నాయిక గురించి చెప్పాడు. రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తని చూచి దుఃఖించే స్త్రీని ఖండిత అంటారు. ఆ సమయంలో అనగా సూర్యోదయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తలు తమ భార్యల కన్నీరు తుడుస్తారు. ఈ శ్లోకంలో పద్మం అనే ఖండిత స్త్రీ ముఖము నుండీ కారే మంచు అనే కన్నీటిని తొలగించే భర్త (లేదా ప్రియుడు) సూర్యుడు అని వర్ణించాడు. అటువంటి సూర్యునికి నువ్వు (మేఘుడు) అడ్డు రాకుండా, తన కిరణాలు అనే చేతులతో మంచు అనే కన్నీటిని తుడవనివ్వు, ప్రేయసీ ప్రియుల మధ్యలో నువ్వెందుకు? అడ్డు తొలగు అంటూ హితోపదేశం చేస్తున్నాడు.

తస్యోత్సఙ్గే ప్రణయిన ఇవస్రస్త గఙ్గాదుకూలాం
న త్వం దృష్ట్వా న పునరలకాం జ్ఞాస్యసే కామచారిన్ ।
యావః కాలే వహతి సలిలోద్గారముచ్చైర్విమానా
ముక్తాజాలగ్రథిత మలకం కామినీ వాభ్ర బృన్దమ్ ॥

ఈ శ్లోకంలో స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక అనే నాయికను ప్రతిబింబిస్తున్నాడు. ఇందులో కైలాస పర్వతాన్ని నాయకుని(ధీర లలితుడు)గా, అలకా నగరాన్ని నాయిక(స్వాధీన పతిక)గా భావించి వర్ణిస్తున్నాడు కవి. స్వాధీన పతికలోని ప్రేమకి, సుగుణాలకి పూర్తిగా వశమయిన ప్రియుడు ఆమెను అనునిత్యం లాలిస్తూ ఉంటాడుట. అలిగిన ప్రేయసిని లాలించే ప్రియుడు ఆమెను తన తొడపై పడుకో పెట్టుకుంటే ఆ స్త్రీ రూపం ఎలా ఉంటుందో, కైలాస పర్వతంపై ఉన్న అలకా నగరం అలా ఉందని కవి భావన! అక్కడ ఆకాశంలో జాలువారే గంగానది ఈ ప్రియురాలు (అలకానగరం) కట్టుకున్న తెల్ల పట్టు చీరలా ఉందిట!

"ఉపమా కాళిదాసస్య, అర్ధాంతరన్యాసోపి విధీయతే" అంటారు. ఈ కావ్యంలో నాకు నచ్చినవి చాలా ఉన్నా, మిక్కిలి ఆకర్షించిన కొన్ని ఉపమానాలు:
ఆమ్రకూట పర్వతాన్నీ, అక్కడ ప్రవహించే రేవా నదినీ వర్ణిస్తూ ఏనుగు ఆకారంలో ఉన్న పర్వతానికి, పాయలు పాయలుగా ప్రవహిస్తున్న నది ఆ ఏనుగు పెట్టుకున్న విభూది రేఖల వలె ఉన్నది అంటాడు.
మార్గ మధ్యలో కనిపించిన "నిర్వింధ్య" నదిని ఒక స్త్రీగా, మేఘాన్ని తన ప్రియునిగా భావిస్తూ, నదిలో వచ్చే సుడులను ఆ స్త్రీ యొక్క నాభిగా అభివర్ణించడం.
చర్మణ్వతీ నదిని ఆకాశం నుండీ చూస్తే భూదేవి మెడలో ధరించిన ఒంటి పేట ముత్యాల హారంలా కనిపిస్తోంది, ఆ నీటి కోసం నువ్వు (మేఘుడు) వంగితే ఆ ముత్యాల హారం మధ్యలో ఉన్న ఇంద్ర నీలమణిలా ఉంటావు అంటాడు.

ఇటువంటి ఎన్నో అద్భుతమయిన ఉపమానాలతో మనోజ్ఞ సీమకి తీసుకెళ్ళాడు కాళిదాసు. చదువుతున్నంత సేపూ ఆ ప్రదేశాలన్నీ అక్కడే ఉండి చూసినట్టు అనిపిస్తుంది. ఇందులో వ్రాసిన ప్రతీ శ్లోకాన్నీ ఒక చిత్రంగా గీయచ్చు. భావకులు ఆ పారవశ్యం నుండీ తేరుకుని బయటకి రావటం చాలా కష్టం. ఏమి ఉపమానాలు! ఏమి విశేషణాలు! ఎన్ని అలంకారాలు! ఆహా! ఒక మహాద్భుతం చూసిన అనుభూతి దక్కింది. విరహం, తన్మయత్వం, భక్తి, ప్రేమ, అనురాగం, శృంగారం, ప్రకృతి వర్ణనలూ, సందేశాలూ అన్నిటినీ సమపాళ్ళల్లో పండించినటువంటి మేఘ సందేశం ఒక చక్కని కావ్యం అనడంలో అతిశయోక్తి లేదు.