Tuesday, June 12, 2012

కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం


ఈ పేరు తలుచుకుంటేనే ఏదో క్రొత్త ఉత్సాహం. సాధారణంగా నేను వ్రాయబోయే టపాల శీర్షికలు ముందుగా చెప్పను. కానీ దీని గురించి ఇంతకు ముందే చెప్పేశాను. మొదట్లో నేను కాళిదాసు రచనలన్నీ చదివి ఆయన గురించి ఒక ప్రత్యేక టపా వ్రాయాలి అనుకున్నాను. నా పిచ్చి కానీ అంతటి మహానుభావుని గురించీ, ఆయన వ్రాసిన ఒక్కో రచన గురించీ చెప్పడానికి మిడి మిడి జ్ఞానం ఉన్న నాకే ఒక టపా చాలట్లేదు అంటే పూర్తిగా అర్థమయ్యి ఉంటే ఆయన వ్రాసిన ఒక్కో రచనలో ఒక్కో శ్లోకానికీ ఒక్కో టపా వ్రాసేదానినేమో! ఆయన గురించి మామూలు మాటల్లో తెలుసుకోవటం కంటే ఆయన రచనల్లో ఆయనని ముందు తెలుసుకోవడం మంచిదని నా ఉద్దేశ్యం. ప్రస్తుతానికి నా పరిధి మేరకు ఆయన ఒక్కో రచననీ పరిచయం చేస్తూ నా అభిప్రాయాలు, అన్వయాలు, ఆలోచనల మేళవింపుతో కాళిదాసుని మీ ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. 


ఈయన రచనల్లో ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పడానికేమీ లేదు (అలా చెప్పడానికి నాకున్న జ్ఞానం సరిపోదు) కానీ ఈ అభిజ్ఞాన శాకుంతలం నన్ను ఎక్కువగా ఆకర్షించింది. ఇది "శృంగార రస" ప్రధానమయిన నాటకం. ఈ కథ అందరికీ బాగా తెలిసినదే కనుక సూక్ష్మంగా చెప్పుకుంటే: హస్తినాపుర రాజయిన దుష్యంతుడు వేటకు వెళ్ళినపుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలని కలిసి, ప్రేమించి,
గాంధర్వ వివాహం చేసుకుంటాడు. కొంతకాలం ఆమెతో ఉన్నాక రాజ్యానికి తిరిగివెళుతూ రాజముద్రికను గుర్తుగా ఇస్తాడు. భర్త గురించిన తలపులతో, విరహంలో ఉన్న సమయంలో ఆశ్రమానికి వచ్చిన దూర్వాస మునిని సరిగా ఆదరించక పోవడంతో ఎవరిగురించయితే ఆలోచిస్తూ నన్ను అశ్రద్ధ చేసావో వారు నిన్ను పూర్తిగా మర్చిపోతారనీ, ఏదయినా గుర్తు చూసినప్పుడే గుర్తువస్తావనీ శకుంతలని శపిస్తాడు. నిజానికి ఈ శాప విషయం కూడా ఆమె వినకుండా భర్త గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. ఇవన్నీ కణ్వ మహర్షి ఆశ్రమంలో లేని సమయములో జరిగినందున తిరిగివచ్చిన మహర్షి జరిగినదంతా తెలుసుకుని శకుంతలను అత్తవారింటికి పంపుతాడు. రాజు వద్దకు వెళ్తున్న శకుంతల నదిలో ఈ రాజముద్రికని కోల్పోవడం, రాజు ఈమెను గుర్తించక నిరాకరించడం, మేనక ఆమెను తీసుకెళ్ళిపోవడం, కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో చేరటం, ఇలా చాలా జరిగి ఒక చేపలవాని వలలో చిక్కిన ఈ రాజముద్రికని రాజు వద్దకు తీసుకెళ్లడం, అప్పుడంతా గుర్తువచ్చిన దుష్యంతుడు శకుంతలని తన వద్దకు తీసుకుని వచ్చి వారి కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేయటం జరుగుతాయి.

ఈ నాటకంలో నాకు శృంగారం కన్నా ధార్మిక సూత్రాలు ఎక్కువగా కనిపించాయి (పుర్రెకో బు
ద్ధి, జిహ్వకో రుచి అన్నారు కదా!). ప్రతీ రచనా శ్రీకారానికి ప్రోద్బలం ఉంటుంది అన్నట్టుగా ఒక రోజున భోజమహారాజు కాళిదాసుని శాకుంతలాన్ని రచించమని అడుగగా ఈయన "శాకుంతలంలోని నాయకుడయిన దుష్యంతుడు ధీరోదాత్తుడు కానందున నేను వ్రాయను" అంటారు. ఇక్కడ మనకు కాళిదాసు రచనలో పాత్రలకి కూడా ఎంత చక్కని గుణాలని ఆపాదించాలని చూస్తాడో అనిపిస్తుంది. తన భార్యాబిడ్డల్ని ఎక్కడ లోకం అనుమానిస్తుందో, అవమాన భారం మొయ్యాల్సివస్తుందో అన్న భయంతో (లోకానికి వారు నిజంగా తనవారే అని అశరీరవాణితో చెప్పించడానికి అలా చేశాడు అని కొందరి సమర్ధన) తన వారు కాదని చెప్పిన దుష్యంతుడిని నాటకంలో నాయకుడిని చేయలేను. అయినా రాజు అడిగినందున ఆయన ముచ్చట తీర్చడానికి తను రాజీ పడలేక ఒక శాపం పొందినట్టు, ముద్రిక చూడటం వలన అంతా మళ్ళీ గుర్తుకు వచ్చినట్టు కల్పించి, నాయకుని లక్షణాలను ఆపాదించి, అభిజ్ఞాన శాకుంతలం అని నామకరణం చేశాడు. అభిజ్ఞానం అనగా ఒక గుర్తు (ఇక్కడ కథలో రాజ ముద్రికే గుర్తు). అందువలననే దీనిని కేవలం శాకుంతలం అని కాక అభిజ్ఞాన శాకుంతలం అనాలి. 
"కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా
తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం"
అన్నట్టుగా కావ్యాలకంటే నాటకాలు రమ్యంగా ఉంటాయి. నాటకాలలో శాకుంతలం, అందులో మళ్ళీ నాల్గవ అంకము, అందులో కూడా శ్లోక చతుష్టయం (ఇది వినగానే నాకు దుష్ట చతుష్టయం గుర్తుకొచ్చింది :)) అద్భుతమయినవి. శ్లోక చతుష్టయం అంటే నాలుగు శ్లోకాలు. ఈ నాలుగూ కూడా కణ్వ మహర్షి చెప్పిన సందర్భంలోవే. ఏమిటా శ్లోకాలు? ఎందుకవి అంత గొప్పవి అంటే వాటిని చదవ వలసినదే:
పాతుం న ప్రధమం యవస్యతిజలా యుష్మాస్వపీ తేషుయా
నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం
ఆజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః
సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం
మనిషికీ ప్రకృతికీ ఉండే బంధాన్ని ఎంత చక్కగా చెప్పాడో కదా కాళిదాసు! మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా త్రాగేది కాదు, చిగురుటాకులను అలంకరించు కోవటం ఎంత ఇష్టమయినా సరే తుంచేది కాదు, తాను పెంచిన మొక్కకి పువ్వు పూస్తే పిల్లలు పుట్టినంత ఆనందించి ఉత్సవం చేసేది, అటువంటి శకుంతల అత్తవారింటికి వెళుతోంది కనుక మీరు అనుజ్ఞని ఇవ్వండి అంటాడు కణ్వ మహర్షి. ఈ శ్లోకంలో మొక్కలని సాటి మనిషిగా, అతిధిగా, సన్నిహితులుగా, బంధువులుగా చూపటం జరిగింది. వృక్షో రక్షతి రక్షితః అని మనం అనడమే తప్ప ఏనాడయినా ఇంత మమకారం చూపించామా? అనిపిస్తుంది నాకయితే.
యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా
కంఠస్థంబిత బాష్పవృత్తి
కలుషశ్చింతా జడం దర్శనం
వైక్లవ్యం మమతావదీ దృశ మిదం స్నేహాదరణ్యౌ కసః
పీడ్యంతే గృహిణః కథంనుతనయా విశ్లేష దుఃఖైర్నవైః

నా కూతురయిన శకుంతల అత్తవారింటికి వెళుతుంటే బాధతో కంఠం పట్టేసి నోట మాట రావటం లేదు, కంటిలో నీరు చేరి చూపు కనిపించటం లేదు, అంతా జడంగా, నిర్జీవంగా అనిపిస్తోంది. మునివృత్తిలో ఏ బంధాలూ లేకుండా ఉండే నాకే ఇంత బాధగా, మనసంతా ఏదోలా ఉందే అదే గృహస్థులకి కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఇంకెంత బాధాకరంగా ఉంటుందో కదా! అని ఆలోచిస్తాడు కణ్వ మహర్షి. ఒక ప్రక్కన తను బాధపడుతూనే వేరే వారి పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కూడా కణ్వ మహర్షిలో కలిగినట్టు చూపెడతాడు కాళిదాసు. ఒక తండ్రికి అత్యంత బాధ కలిగే సమయం ఇదే అంటారు అందుకేనేమో!

అస్మాన్ సాధు విచింత్య సంమ్యమధనాన్ ఉచ్ఛైః కులంచాత్మనః
త్వైయస్యాః కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం
సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా
భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వధూబంధుభిః

కూతురితో రాజయిన అల్లుడికి కణ్వ మహర్షి పంపే సందేశమే ఈ శ్లోకం. నేను సారెలు, కట్నకానుకలు ఇవ్వలేదు. ముని వృత్తిలో ఉన్న మాకు తపస్సు, నీతి నియమాలే ధనం. రాజువయిన నీకు ఇంతకన్నా గొప్ప ధనాన్ని (నీ తాహతుకు తగ్గట్టు) మేము ఇవ్వలేము. కావున అవేమీ ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు, డబ్బు,నగలు లేవని తృణీకార భావంతో చూడకు. మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. స్నేహభావంతో, అనురాగంతో మీరిరువురూ గాంధర్వ వివాహం చేసుకున్నారు కనుక మా అమ్మాయి నచ్చలేదు అని ఏ నాడూ అనకు. నీకు చాలా మంది భార్యలున్నా (బహు భార్యత్వం ఆ కాలంలో సహజమే) వారితో సమానంగా చూడు. వారికన్నా బాగా చూసుకుంటాను అంటే అది శకుంతల భాగ్యం కానీ నేను మాత్రం వారికన్నా బాగా చూడమని చెప్పకూడదు అని ఈ శ్లోక సారాంశం. నన్నెంతగానో కదిల్చింది. ఎంత ముందుచూపు ఆ తండ్రికి? నీతి నియమాలు, సత్ప్రవర్తనకి మించిన ధనం ఉంటుందా? ఈ విషయం ఈ కాలం వారు గ్రహించి ఆచరిస్తే ఎంతో మంది స్త్రీలు కట్న పిశాచికి బలి కాకుండా ఉండేవారేమో కదా! అనిపించింది.
సుశ్రూషస్వ గురూన్ ప్రియసఖీ వృత్తిం సపత్నీజనే
భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతీ పంగమః
భూయిష్ఠం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః
ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో అల్లుడు కూతురిని ఎలా చూసుకోవాలో చెప్పిన కణ్వ మహర్షి ఈ శ్లోకంలో ఆడపిల్ల అత్తవారింట ఎలా ఉండాలో చెప్పాడు. పెద్దలకి (అత్తమామలకీ, మొ..వారికి) సేవ చెయ్యి, సవతులతో స్నేహంగా ఉండు, భర్త కోపంలో ఒక మాట అన్నా రోషం తెచ్చుకోకుండా అతనితో సామరస్యంగా ఉండు, సేవకుల యందు దయకలిగి ఉండు వారిని ఏ నాడూ తక్కువగా చూడకు, భోగ భాగ్యాలున్నాయి అన్న ఉద్వేగంతో గర్వం దరిచేరకుండా చూసుకో. ఇలా ఉన్నప్పుడే యువతులు గృహిణీ స్థానం పొందుతారు లేదా చెడ్డ పేరు తీసుకువస్తారు అని చెప్తాడు. ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం. తప్పక ప్రతీ ఒక్కరూ ఇవన్నీ పాటిస్తూ ఆచరణలో పెట్టగలిగితే (?) ఈ కాలంలో విడాకులు అనేవి ఉండేవి కావేమో! అనిపిస్తుంది.

ఈ నాలుగు శ్లోకాలూ అమోఘం. కాళిదాసు ఇవన్నీ ఈ కాలంలో పరిస్థితులు ఇలా ఉంటాయన్న ముందుచూపుతో ఇవన్నీ వ్రాశాడో, లేక మామూలుగానే వ్రాశాడో తెలియదు కానీ ప్రపంచం ఎంతగా మారిపోయినా ప్రతీ ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవలసిన మాటలు కదూ! అందుకేనేమో ఇవి శ్లోక చతుష్టయం అంటూ అంతటి గొప్ప స్థానాన్ని పొందాయి. 

 
ఈ నాటకమంతటిలో నాకు కాళిదాసు జనాలకి ఎక్కువ ఉపదేశాలు చేశారనిపిస్తుంది. ఎన్నో ధర్మాలకి అక్షర రూపం ఈ నాటకం. ప్రతీ శ్లోకంలోనూ ఒక్కో ధర్మాన్ని చూడచ్చు. వాటిల్లో అన్నీ వ్రాయలేను కానీ కొన్ని ముఖ్యమయినవి, ఆలోచించ తగినవి (నా ఉద్దేశ్యంలో):

ప్రాణానామనిలేన వృత్తి రుచితా సత్కల్ప వృక్షేవనే
తోయే కాంచన పద్మరేణుకపిశే ధర్మాభిషేక క్రియా
ధ్యానం రత్న శిలాతలేషు విభుధస్త్రీ సన్నిధౌ సంమ్యమః
యత్కాంక్షంతి తపోభిరన్య మునయః తస్మిన్ తపస్యంత్యమీ

ఇది దుష్యంతుడు కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితిని వర్ణించిన సందర్భంలోనిది. అక్కడ ఉన్న జనాలు కల్పవృక్షం క్రింద కూర్చుని ప్రాణాయామం చేస్తున్నారు, ఆకాశగంగలో బంగారు తామరపూల మధ్యన స్నానం చేస్తున్నారు, రత్నాలతో చేసిన వేదిక పైన కూర్చుని తపస్సు చేస్తున్నారు, చుట్టూ అప్సరసలు తిరుగుతున్నా పట్టించుకోకుండా ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అసలు సాధారణ మానవులు ఏవయితే కోరుకుంటారో వాటికి మించి ఉన్నా కూడా మోక్షం కోసం ఇవన్నీ చేస్తున్నారు. అంటే దీనిని బట్టీ కాళిదాసు ఈ భోగభాగ్యాలు శాశ్వతం కాదు ఆత్మసాక్షాత్కారం, మోక్షం మాత్రమే శాశ్వతం అని చెప్తున్నాడా (?) అనిపిస్తుంది. కానీ వారిలో వేటికీ చలించకుండా ఉన్న చిత్తశుద్ధి, చేస్తున్న పని మీద ఏకాగ్రత మనకు ఉంటే అబ్బో! ఎన్ని సాధించే వాళ్ళమో!   

తన వద్దకు వచ్చిన శకుంతలని నిరాకరించిన దుష్యంతునికి ఒక పాట వినిపిస్తుంది. దాని భావం "తుమ్మెదా! నువ్వు ఒక పువ్వు మీద వాలి మకరందాన్ని స్వీకరించావు, తరువాత దీనిని వదిలేసి ఇంకొక పువ్వు మీద వాలతావు" అని ఉంటుంది. అది వినేసరికి దుష్యంతుని
కి మనసులో అల్లకల్లోలం. మనసుకి బాగా పట్టేసినది ఏదయినా విన్నా, దాని గురించి ఏం తెలిసినా అదంతా గత జన్మ భావన అనుకోవటమే కాక మనసు చలించిపోయి ఉద్వేగానికి గురవుతారు. అందుకే భావస్థిరాణి జననాంతర సౌహృదాని అంటారు. ఇక్కడ దుష్యంతుని ఆ తుమ్మేదని నేనే ఎవరినో వదిలేసాను అన్న భావన గత జన్మలోదని భావించాడు కానీ ఈ జన్మలోదే అని శాప ప్రభావం చేత తెలుసుకోలేకపోయాడు. మనసుకి బాగా దగ్గరయినవి ఎన్నటికీ మర్చిపోలేము అన్న మాట మనందరికీ అనుభవమే కదా!

ఒక
పౌర్ణమి తరువాతి రోజు సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఒకరు (చంద్రుడు) అంతమవుతుంటే ఒకరు (సూర్యుడు) పుడుతున్నాడు అంటారు కాళిదాసు. ఇది మనందరం చూసే విషయమే కదా ఇందులో వింతేముంది అనుకోకండి. ఆలోచిస్తే ఒక మనిషి చనిపోతుంటే వేరొక మనిషి పుడుతున్నాడు అన్న అంతరార్థం ఉంది కదా. అది చెప్పేందుకే ఇలా చూపించాడా అనిపిస్తుంది.

వాస్తవానికి రాజయిన దుష్యంతునికి మునికుమార్తె శకుంతల మీద ప్రేమ భావం కలుగకూడదు. కానీ కలుగుతోంది అంటే ఇది నిజంగా తప్పు కాదు అనుకుంటాడు (నిజానికి ఈమె విశ్వామిత్రుని కుమార్తె కదా).
సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః అన్నట్టు సందేహంగా ఉన్నప్పుడు మనసు ఏది చెప్తే అదే చేయమని అంటాడు కాళిదాసు.
సత్పురుషులకీ, గొప్పవారికి మనస్సే ప్రమాణం. అందుకే కదా మనస్సాక్షికి మాత్రమే భయపడాలి అంటారు.

అత్తవారింటికి వెళ్తున్న శకుంతల తండ్రయిన కణ్వ మహర్షిని మళ్ళీ పుట్టింటికి ఎప్పుడు రాను? అని అడుగుతుంది పుట్టింటి మీద మమకారంతో. అది విన్న ఆయన వానప్రస్థానికి రమ్మంటాడు. దీనిని బట్టీ పెళ్ళయిన ఆడపిల్ల అస్తమానూ పుట్టింటికి రాకూడదు అన్న విషయం చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే నాటకమంతా చాలా చాలా ఆలోచనలను రేపింది. కాళిదాసు రచనలన్నింటిలోనూ అభిజ్ఞాన శాకుంతలం ఎంతో కీర్తి సంపాదించుకుంది. వేరే భాషలలో కూడా ఎక్కువగా అమ్ముడయిన పుస్తకం ఇదే (ట). ఎన్నో భాషలలోకి తర్జుమా చేసినా సంస్కృతంలో మాత్రమే
చదవాలని కేవలం ఈ నాటకం ఆస్వాదించడం కోసమే కొంతమంది సంస్కృతం నేర్చుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. నేనూ అలా నేర్చుకున్నదే :)


Monday, June 04, 2012

కుశ(ల)మా



ఈ చిత్రము, శీర్షిక పేరు చూసి ఈ పాటికే మీకు నేను ఈ టపా దేని గురించి వ్రాయబోతున్నానో అర్థమయ్యే ఉంటుంది. సరే ఎక్కువగా ఉపోద్ఘాతం ఇవ్వకుండా మొదలుపెడుతున్నాను.

మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" (Desmostachya bipinnata) ముఖ్యమయినది. 
దీనిని ఆంగ్లములో Halfa grass, Big cord grass, Salt reed-grass అనీ ప్రాంతానికి తగ్గట్టు పిలుచుకుంటారు. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.

అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.


శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం

అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:
దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!

అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.

వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.

దర్భల కొనలు విడుదల చేసే తేజము - దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.

వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:
విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ 
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ

ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి.

వీటి గురించి ఒక ప్రత్యేక టపా వ్రాయమని కోరిన రాజా గారికి కృతజ్ఞతలతో....