Thursday, March 29, 2012

"యక్ష" కబుర్లు


యక్షులు అనగానే వాళ్ళు దెయ్యాలేమో అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. నాకు కూడా ఇదే భావన ఉండేది కానీ మన శివ పంచాక్షరీ స్తోత్రంలో శివుడిని స్తుతిస్తూ యక్షస్వరూపాయ అని అంటాం కదా! శివుడు దేవుడు కాబట్టి వాళ్ళెవరో కూడా గొప్పవాళ్ళే అయ్యుంటారు అనుకున్నా. ఈ యక్షుల ప్రస్తావన మన పురాణాలలో కూడా చాలా సార్లు వస్తుంది కనుక వారి గురించి మరిన్ని ఆసక్తికరమయిన విషయాలు తెలుసుకున్నా. వాటిని మీతో పంచుకుందామని ఇక్కడ పెడుతున్నా.
విషయానికి వస్తే, వీరు దేవతా గణాలలో ఒకరు. వీరి నివాసం అథోలోకాలలో ఒకటయిన తలాతలం (అతలంలో పిశాచ గణాలు, వితలంలో గుహ్యకులు, సుతలంలో రాక్షసులు, రసాతలంలో భూతాలూ, తలాతలంలో యక్షులు, మహాతలంలో పితృదేవతలు, పాతాళంలో పన్నగులు ఉంటారు). అలానే, గోమాతలో సకల దేవతలు, దేవతా గణాలన్నీ ఉన్నాయి అంటారు కదా! అలా చూసుకుంటే వీరి నివాసం గోమాత యొక్క వామ భాగం. వరాహ పురాణంలో ఒక్కో దేవతా గణాలకీ ఒక్కో పర్వతం నిలయంగా ఉంటుందని చెప్పబడింది. దాని ప్రకారం వీరి నివాస పర్వతం శతశృంగం.
వీరు ఎక్కడుంటారో తెలిసింది కనుక ఎలా ఉంటారు అన్నది తెలియాలి. వీరిలో మగ వారిని యక్షుడు అని, ఆడవారిని యక్షిని అని అంటారు. వీరు సౌందర్యమయిన శరీరాకృతిని కలిగి ఇక్కడ చిత్రములో చూపిన విధముగా ఉంటారు. యక్షులకి కుబేరుడు రాజు. వీరి పని గుప్త నిధులకి కాపలా. వీరిని ప్రసన్నం చేసుకోగలిగితే మనం కోరుకున్నవి దక్కించుకోవచ్చు అని ఉత్థమారేశ్వర తంత్రంలో చెప్పబడింది. వీళ్ళల్లో యక్షినులు అత్యంత శక్తి కలవారు. వారిని మనం ఆవాహనం కూడా చేసుకోవచ్చుట. అటువంటి సమయాల్లో వాళ్ళు మనిషి శరీరంలోకి చెవి ద్వారా ప్రవేశిస్తారుట. వీళ్ళు సాధారణంగా మంచి చేస్తూ శాంతంగా ఉంటారు కానీ కొద్ది మంది రౌద్రంగా ఉండి చెడు చేస్తారుట.
యక్షులు మంచి కళాపోషకులు అని నా అభిప్రాయం. కాళిదాసు రచించిన మేఘదూతం (తెలుగులో మేఘసందేశం)లో యక్షుడు తన ప్రియురాలయిన యక్షినిని వదిలి ఉండలేక ఆ విరహానికి చక్కని అక్షర రూపం ఇచ్చాడు. అలానే యక్ష ప్రశ్నల (యమ ధర్మరాజు ఒక యక్షుని రూపంలో వెళ్తాడు) గురించి వినే ఉంటారు. అవి చదివితే అబ్బో వాళ్ళెంత తెలివయిన వాళ్ళో అనిపిస్తుంది. హరివంశ కావ్యాన్ని తెలుగులో రచించిన వారిలో ఒకరయిన నాచన సోమన గారిని ఘను నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్ అని కొనియాడారు పరవస్తు చిన్నయసూరి గారు.
మనకి బాగా తెలిసిన యక్షిని తాటకి. సుకేతుడు అనే యక్షుడు పిల్లలకోసం తపస్సు చేసినపుడు నీకు వెయ్యి ఏనుగుల బలం ఉన్న కూతురు పుడుతుంది అని బ్రహ్మ వరం ఇవ్వగా తాటకి పుట్టింది. ఈమెను ఝఝరుడను యక్షుని కుమారుడయిన సుందుడు కి ఇచ్చి పెళ్లి చేయగా వారికి మారీచుడు పుడతాడు. ఒకసారి సుందుడు అగస్త్యున్ని కొట్టడానికి వెళ్తాడు అప్పుడు ఆయన ఆగ్రహంతో సుందుడిని భస్మం చేస్తాడు . అది భరించలేక తాటకి, మారీచుడు కలిసి అగస్త్యుని చంపడానికి వెళ్తే ఆయన వీరివురినీ రాక్షసులు అవ్వమని శపిస్తారు. అలా యక్షులు కాస్తా రాక్షసులుగా మారారు అని వాల్మీకి రామాయణంలో బాలకాండలో చెప్పబడింది.
మనకి బాగా తెలిసిన మరికొంతమంది యక్షులు మణిగ్రీవుడు, నలకూబరుడు. వీరిద్దరినీ మద్ది చెట్టులై పడమని ఒక ముని శపిస్తాడు. ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి కృష్ణుడు రోలుని (యశోదా దేవి కృష్ణుడిని రాతికి కట్టినపుడు) పెట్టి లాగడం వలన వాళ్ళకి శాపవిమోచనం జరుగుతుంది.
యక్ష గానం అనేది చందోబద్ధమయిన నాటకము, కూచిపూడి నాట్యంలో ఒక ప్రక్రియ. ఇందులో గద్యం, పద్యం, పాటలు అన్నీ కలగలిపి ఉంటాయి. యక్ష గానాలలో రామాయణాన్ని రచించి ఎంతో మందికి చేరవేసినది ఆంధ్ర కాళిదాసు బిరుదాంకితుడయిన ఆలూరి కుప్పన కవి. శ్రీనాధుని కాలంలో ఇవి బాగా ప్రచారంలో ఉండేవని, తెలుగులో మొత్తం నాలుగువందలు పైచిలుకు యక్ష గానాలున్నాయని అంచనా.

యక్షులు దేవతా గణాలే అయినా కొంతమంది స్వార్థ పరులకి ఉపయోగపడటం వలన, వీరు రాత్రి పూట ఎక్కువగా విహరించటం వలన వీరిని దెయ్యాలలా భావిస్తున్నారు. పూర్వం విఠాలాచార్య సినిమాలలో మనం చూసిన ఎన్నో శక్తులని (పాదుకా సిద్ధి, అంజన సిద్ధి, మేఘ సిద్ధి, మొదలయినవి) చూసి నిజం కాదేమో అనుకున్నా కానీ ఇవన్నీ యక్షుల శక్తులు.

Wednesday, March 21, 2012

కల్హారుడు


ఆదరణ ఉన్నా తెర మరుగయిన కవుల్లో కల్హారుడు ఒకరు. ఈయన పండితులకి ప్రసిద్ధమయిన కాశ్మీర దేశపు సంస్కృత పండితుడు. పన్నెండు - పదమూడవ శతాబ్దపు కవి అని వినికిడి. కాంతా కళ్యాణ కాంత ప్రహసనం అనే హాస్య భరితమయిన ప్రహసనాన్ని (గాథని) రచించి భోజుని కాలంలో ఎన్నో సత్కారాలు పొందినా మన దురదృష్టవశాత్తూ కవి సంబంధిత విషయాలూ, కవి వ్రాసిన ప్రహసనమూ కూడా అందుబాటులో లేవు. భోజుని ఆస్థాన కవులలో మనకి బాగా వినిపించే పేర్లు కాళిదాసు, భవభూతి, దండి మాత్రమే అయినా కల్హారుని పేరు కొన్ని భోజ రాజుని కథల ద్వారా వినిపించటం వలన ఆయన ఉనికి తెలుస్తోంది. అలా నేను విన్న కల్హారుని కథని ఈ టపా ద్వారా చెప్పదలచాను. ఆయన రచనలు, పద్యాలు మనం వినకపోయినా, చదవకపోయినా ఈ కథ ద్వారా ఆయన రచనా శైలి, ప్రతిభ, చమత్కార పద ప్రయోగాలు మనం గుర్తించవచ్చును. 

ఒకరోజు భోజుడు, కాళిదాసు., మొదలయిన మహాకవులందరికీ ధనాన్ని ఇస్తున్నాడని విని పుట్టుకతో నిరుపేద అయిన కల్హారుడు కూడా ధారానగారానికి బహుమానాన్ని అందుకోవాలని వచ్చి తన పేరుని నమోదు చేసుకుంటాడు. తన కంటే ముందు వెళ్ళిన కవులు విశేషమయిన సన్మానాలతో, బహుమతులతో తిరిగి వస్తుండటం గమనించి ఈయనకి అసలు లోపల ఏమి జరుగుతోందో చూడాలన్న ఉత్సుకతో ఈయన వంతు వచ్చేవరకూ ఆగలేక ప్రేక్షకుల వరుసలో కూర్చుని సభను తిలకించి వచ్చేవాడు. ఈయన వంతు వచ్చేసరికి కొన్నాళ్ళు పడుతుందని బాధపడుతుండగా ఒక దురాలోచన కలిగింది. అదేమిటంటే రాజాస్థానం మొత్తం బంగారమే కనుక కనీసం ఒక్క చెంబయినా దొంగిలిస్తే ఈ జీవితానికి సరిపోతుంది అని అనిపించింది. ఇహ ఆలస్యం చేయక ఆ రోజునే పొద్దుపోయాక, ఉద్యానవనం ద్వారా సైనికుల కళ్ళు గప్పి మెల్లగా భోజుని శయన మందిరానికి వెళ్ళాడు. 

ఆయన మందిరంలో అంతగా కాపలా లేకపోవటంతో, ఎలాగో రాజు వచ్చేముందు ఆహ్వాన సూచకంగా పెద్దగా గంటల మోత ఉంటుంది కనుక ఈ లోపు తను వచ్చిన కార్యాన్ని పూర్తి చెయ్యాలని రాజు గారి బీరువాని తెరిచాడు. తెరవగానే కళ్ళు చెదిరిపోయేలా ఉండే చక్కని వజ్రాల హారం కంట పడింది. దానిని తీసుకుని తన సంచీలో వేసుకుందామనుకోగా"బంగారు హారాన్ని దొంగిలిస్తే పది జన్మల పాటు మూగవాడై పుడతాడు" అనే అర్థమున్న శ్లోకం గుర్తుకువచ్చి నోరుంటేనే కదా నాలుగు రాళ్ళు సంపాదించుకునేది అనుకుని హారాన్ని వదిలేసాడు. బీరువా పై అరలో చేయి పెట్టగా రత్నాలు పొదిగిన వడ్డాణం తగిలింది. దానిని తీసుకుందామంటే "బంగారు వడ్డాణాన్ని దొంగిలిస్తే ఎనిమిది జన్మలు అవిటివాడై జీవిస్తాడు" అనే అర్థమున్న శ్లోకం గుర్తుకొచ్చి కాలూ చేయీ లేకపోతే కైలాసం కూడా నరకమే అనుకొని దానిని కూడా వదిలేసాడు. ప్రక్కకు చూడగా బంగారు తీగతో చుట్టిన మేలి ముత్యాల దండలు కనిపించాయి. వాటిని తీసుకోబోతుండగా"రాజుగారి ముత్యాల హారాన్ని దొంగిలిస్తే ఆరు జన్మలు కళ్ళు లేని వాడిగా పుడతాడు" అనే అర్థమున్న శ్లోకం గుర్తుకొచ్చి నేత్రం లేనిదే జీవయాత్ర లేదు అనుకుని దానిని కూడా వదిలేసాడు. ఇలా ఏ వస్తువు తీసినా ఏదో ఒక శ్లోకం గుర్తుకు రావడమూ తను ఆ ఆలోచన విరమించుకోవడమూ గమనించి అట్టే సమయాన్ని వృధా చేయకూడదని తను ఎప్పటినుంచో కలవరిస్తున్న బంగారు చెంబుని తీసుకుని బయలుదేరబోయాడు.

ఇంతలో దివాణంలో గంటలు మ్రోగాయి అంటే రాజుగారు శయన మందిరానికి వచ్చేస్తున్నారు, ఈ శ్లోకాల కారణంగా ఎంత సమయం వృధా అయ్యింది అనుకుని పట్టుబడితే శిక్ష దారుణంగా ఉంటుంది అని భయపడుతూ రాజుగారి బంగారు మంచం క్రింద నక్కి కూర్చున్నాడు కల్హారుడు. మంచం మీద పరచిన దుప్పటీ నాలుగు వైపులకీ నేలకు ఆనేలా వేయటం వలన అతనికి ఒక గదిలో ఉన్నట్టనిపించి భయపడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారేసరికి గంటలు మ్రోగడంతో ఈయన నిద్ర మత్తు వదిలింది. కిటికీలన్నీ తెరిచి కర్పూర హారతులిచ్చి, వందిమాగధులు భోజుని గొప్పదనాన్ని పొగుడుతుండగా, కిటికీలోంచి ఏనుగుల ఘీంకారాలూ, గుఱ్ఱాల సకిలింపులూ వినేసరికి కవితా ప్రియుడైన భోజునికి ఆనందంతో కవిత్వం వచ్చింది.
 
చేతోహరా యువతయ స్సుహృదోƨనుకూలాః
స ద్బాంధవాః ప్రణయ గర్భగిర శ్చ భృత్యాః
గర్జంతి దంతినివహా స్తరలా స్తురంగాః
......................................................
అంటూ అక్కడ పరిస్థితినీ, కోలాహలాన్నీ కళ్ళకు కట్టినట్టు వర్ణించి ఆఖరి పాదం ఎలా చెప్పి పూర్తి చేయాలా అని ఆలోచనలో పడ్డాడు భోజుడు. 
 
కవిత్వానికి బహుమానం ఇచ్చే భోజుడు ఇలా ఆగిపోయేసరికి ఏమీ ఆలోచించకుండా, తోసుకోస్తున్న కవిత్వాన్ని ఆపుకోకుండా మంచం క్రిందనుంచే
సంమోలనే నయనయో ర్న హి కించి దస్తి (అంటే ఇన్ని భోగాలూ, సంపదలూ అన్నీ కూడా కన్నుమూస్తే ఏవీ ఉండవు) అని పూరించాడు. వేదాంతంతో కూడిన చక్కని కవిత్వం, పైగా ఎలా ముగించాలా అని ఆలోచిస్తున్న శ్లోకం ఇంత చక్కగా చెప్పినతనిని అభినందించాలని మంచం క్రిందకి చూసాడు. కల్హారుడికి మాత్రం శ్లోకాలు వచ్చిన కారణంగా దొంగను కాలేకపోయాను, అలానే కవిత్వం వచ్చిన కారణంగా పట్టుబడిపోయాను అని బాధపడుతూ బయటకి వచ్చి తను దొంగిలించిన చెంబుతో సహా నమస్కరించాడు. భోజుడు మంచం దిగి కల్హారుడిని ఆనందంతో కౌగలించుకుని మొత్తం శ్లోకంలోని ప్రతీ అక్షరానికీ లక్ష చొప్పున బహుమతిని ఇచ్చాడు. అక్షరలక్షలు అనే మాట భోజుని నుంచి వచ్చినదే.
 
కల్హారుడిని సన్మానించాక భోజుడు చెంబు దొంగిలించటం వెనుక ఉన్న కథని అడిగాడు. అప్పుడు ఆయన 
 
గ తానుగతికో లోకః న లోకః పరమార్ధికః
గుప్త స్సైకతలింగేన నష్ట మ్మే తామ్రభాజనం
 
అంటూ పద్య రూపంలో గతాన్ని వివరించాడు. ఒకసారి పర్వదినం నాడు గంగా నదిలో స్నానం చేద్దామని నాకున్న పెద్ద ఆస్తి అయిన నా రాగిచెంబును వెంట తీసుకెళ్ళాను. జనాలు ఎక్కువగా ఉండటం వలన నా చెంబు పోతుందేమో (స్నానాంతరం జపం చేసుకునేటప్పుడు అడ్డం) అని ఏవేవో మంత్రాలు చదువుతూ ఒడ్డున బోర్లించి దాని మీద ఇసుకతో శివలింగాకారాన్ని చేసి మొదట్లో రెండు పువ్వులు కూడా వేశాను. ఇహ భయం లేదనుకుని నదిలో దిగి స్నానం చేసి సంధ్య వార్చి జపం ముగించుకుని ఒడ్డున చూస్తే అక్కడ పలు వరుసలలో అన్నీ సైకత శివలింగాలే ఉన్నాయి. కవీ, పండితుడూ, బ్రాహ్మణుడూ అయిన నేను అలా చేయటం వలన అలా చేయాలని ఏ వేదంలోనో, శాస్త్రంలోనో చెప్పారేమో! నదిలో స్నానం చేసే ముందు అందరూ అలానే చెయ్యాలి కాబోసు అనుకుంటూ అందరూ అదే పని చేయటం వలన బోలెడు లింగాలు ప్రత్యక్షమయ్యాయి. ఇహ తరువాత ఏం చెయ్యాలా అనుకుంటూ అందరూ నన్నే చూస్తున్నారు పైగా వాటన్నిటిలో నా చెంబు ఏదో తెలియక మదనపడుతుండగా చేసేది లేక ఏవో మంత్రాలు చదువుతూ (సంబంధం లేకపోయినా సరే!) ఒక శివలింగాన్ని చేతితో చితిపాను. నా ఉద్దేశ్యం ఆ లింగంలో నా చెంబు ఉండచ్చు అని కానీ అది నా చెంబులింగం కాదు. (చెంబులింగం అనే పదం ఈయన ద్వారానే లోకానికి వచ్చింది). అది చూసి అందరూ చెంబులింగాలని చిదిపారు. ఎవరికీ ఏ చెంబులు దొరికాయో కానీ నా చెంబు మాత్రం గంగపాలయ్యింది (గంగా నదీ ఒడ్డున దొంగలపాలయ్యింది అని అర్థం! ఈ పదం కూడా ఈయన ద్వారానే లోకానికి వచ్చింది) అని చెప్పాడు కల్హారుడు. ఈ కథను విన్న భోజుడు మరింత సంతోషించి కల్హారుడు దోచుకున్న చెంబుతో పాటు మరొక బంగారు చెంబుని కూడా ఇచ్చి పంపించాడుట. 
 
ఈ కథ ద్వారా, ఆయన పరిచయం చేసిన చెంబులింగం, గంగపాలయ్యింది అనే పదాల ద్వారా కల్హారుడు మనందరి మధ్యన ఉన్నా ఆయనని మాత్రం తలుచుకోము! ఈయన గురించి నాకు తెలిసినవి చెప్పాను మరింత సమాచారం ఎవరి వద్దనయినా ఉంటే తప్పక తెలియచేయగలరు! 

Tuesday, March 13, 2012

కస్తూరి


కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ్
కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడామణి

అంటూ చిన్నప్పుడు అందరూ నేర్చుకుని శ్రీ కృష్ణుడిని స్తుతించే ఉంటారు కదూ! ఆ సమయంలో మీకేం అనుమానం రాలేదా? ముందు నీకొచ్చిన సందేహం ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నా! ఈ కస్తూరి అనేది తిలకం పేరా? లేక తిలకాన్నే కస్తూరి అంటారా? అదొక తిలకం బదులు వాడే ఆభరణమా? కస్తూరి అంటే ఏమిటి? అని. సరే ఇహ ఎక్కువగా సుత్తి కొట్టకుండా నేరుగా విషయంలోకి వచ్చేస్తున్నా.

పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి, ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది. మనకి తెలుసున్నంతవరకు లేదా విన్నంతవరకు దీని ప్రస్తావన ఎక్కువగా కృష్ణుని వద్దనే విన్నాం కాని ఇది చూడండి.

చారు చంపక వర్ణాభం హ్యేక వక్త్రం త్రిలోచనం ఈషద్ధాస్య ప్రసన్నాస్యం రత్న స్వర్ణాది భూషితం
మాలతీ మలయాయుక్తం సద్రత్న ముకుటోజ్జ్వలం సత్కంఠాభరణం చారు వలయాంగద భూషితం
వహ్నిశౌచేనాతులైన త్వతి సూక్షేణ చారుణా అమూల్య వస్త్ర యుగ్మేన విచిత్రేణాతి రాజితం
చందనాగరు కస్తూరి చారు కుంకుమ భూషితం రత్న దర్పణ హస్తం చ కజ్జలోజ్జ్వలలోచనం

అందమయిన సంపెంగల కాంతి వంటి మేని కాంతితో ప్రకాశించేవాడు, ఒక ముఖము కలవాడు, మూడు కన్నులు కలవాడు, చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన ముఖము కలవాడు, బంగారు రత్నాభరణములతో అలంకరింపబడినవాడు, మల్లె మాలలను ధరించినవాడు, గొప్పవైన రత్నములతో పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమైన కంకణములు, అంగదములతో అలంకరింపబడినవాడు, అగ్నివలే ప్రకాశించే సాటిలేని సన్నని నూలుతో వడకిన రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు, చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో అలంకరింపబడినవాడు, రత్నపుటద్దమును చేతియందు కలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు కలవాడు అయినటువంటి ఆ శివుడు కళ్యాణార్థం సర్వావిధ అలంకృతుడై తరలి వెళ్ళాడు అని శివపురాణంలో చెప్పబడింది. ఎంత అద్భుతమయిన వర్ణనో కదా! కేవలం కృష్ణుడి అలంకరణలో వినే కస్తూరిని శివుడు కూడా వాడటం జరిగిందని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది!

కస్తూరి తిలక తిద్దువె కాలిగె గెజ్జె కట్టువె
కాశీ పీతాంబర కొడువె కణ్ణిగె కాడిగె హచ్చువె

అంటూ ఆ విష్ణువుని భజనలో కూడా కస్తూరిదే ప్రథమ స్థానం. కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి, మూల, భరణి నక్షత్రాలకు హోమద్రవ్యము క్రింద వాడవలెనని శ్రీ విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. అలానే మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని మణిద్వీప వర్ణన (దేవీ భాగవతం) లో కూడా ఉంది.

కస్తూరి జింక
ఇన్నిటిలో ముఖ్య పాత్రను పోషించే కస్తూరి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వాస్తవానికి కస్తూరి అనేది అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి. కస్తూరికిలో వెల దాదాపు రెండున్నర లక్షల రూపాయలు! పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకూ దీనిని సహజసిద్ధంగా తయారు చేసినా దానికున్న ఎన్నో ఉపయోగాల వలన కృత్రిమంగా కూడా దీనిని తయారుచేస్తున్నారు.

కస్తూరికి ఆంగ్ల నామమయిన మస్క్ సంస్కృత పదమయిన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది. ఇది మగ కస్తూరి జింక (Moschus moschiferus L.) యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే పరిమళము. కస్తూరిని పొందటం కోసం ఈ గ్రంధి మొత్తాన్ని జింక శరీరం నుండి వేరు చేస్తారు. బాగా పెరిగిన, ఆరోగ్యకరమయిన గ్రంధిలో నలభై శాతం కస్తూరి ఉంటుంది. ఈ గ్రంధిని బాగా ఎండపెట్టడం వలన అందులో దాగి ఉన్న ముదురు ఎరుపు రంగులో ఉండే కస్తూరి నలుపు రంగులోకి మారుతుంది. ఇలా మారినప్పుడు అది వాడకానికి సిద్ధమయినదని అర్థం. ఇంతకీ ఈ మగ జింక కస్తూరిని ఆడ జింకను ఆకర్షించుకోవడానికి తయారుచేసుకుంటుందిట. ప్రత్యుత్పత్తి కాలంలో (మే - జూన్) ఎక్కువ శాతం కస్తూరిని తరాయుచేస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు.

కస్తూరిని తయారుచేసే గ్రంధి
దీనిని టిబెట్, చైనా, తదితర ప్రాంతాలలో ఎక్కువగా తయారుచేస్తారు. కృత్రిమంగా వీటిని పెద్ద మోతాదులో తయారుచేస్తున్నారు. ఆ ఇతర సంబంధిత పరిమళాలను కూడా కస్తూరి (ధవళ కస్తూరి) అనే పిలుస్తారు. అయితే ఇలాంటివి చాలా మటుకు అసలైన కస్తూరి కంటే భిన్నమైన రసాయన పదార్ధాలనుండి ఉత్పన్నమై ఉండవచ్చు కూడా. కస్తూరి జింక కాకుండా ఇతర జంతువుల యొక్క గ్రంధి స్రావకాలు, కస్తూరిని పోలిన పరిమళాన్ని వెదజల్లే అనేక మొక్కల యొక్క స్రావకాలు, ఈ వాసన కలిగిన కృత్తిమ పదార్ధాలను కూడా కస్తూరి అనే భావిస్తున్నారు జనాలు. కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు ముస్కోన్. దీనికి ఉన్న ప్రాముఖ్యమయిన పరిమళాన్ని గుర్తించిన యూరోపియన్లు దానిని perfumes తయారీలో వాడుతారుట. అదే కాక దానికున్న పరిమళం వలన అగరుబత్తులు, సాంబ్రాణి అన్నిటికీ కస్తూరి పేరు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజమయిన జింక కస్తూరిని కలుపుతారో తెలియదు! సారంగ నాభి, కురంగ నాభి, జింక పొక్కిలి, ఏణమదము, ఇట్టి గోరోజనము, సహస్ర వేధి, లత, మోదిని, మొదలయినవి కస్తూరి రకములు.



ఆయుర్వేదములో కూడా కస్తూరి ప్రముఖ పాత్రని పోషిస్తోంది. ఎలా అంటే:
౧. చాలా కాలంగా కస్తూరి మాత్రలను తమలపాకు రసంలో నూరి తేనెలో కలిపి జలుబుకి, దగ్గుకి ఔషధంగా వాడుతున్నారు.
౨. గర్భిణీ స్త్రీలకు కస్తూరిని ఎక్కువగా నొప్పులకి వాడతారు. వాతపు నొప్పులయితే తగ్గుతాయి, అదే పురిటి నొప్పులయితే కాన్పు జరుగుతుంది అని కస్తూరి రసం పట్టించేవారు.
౩. వాతానికి అద్భుతమయిన మందు కస్తూరి. అందుకనే దీనిని తాంబూలంలో కలిపి తింటారు.
౪. అజీర్ణం, కఫం, అతిసారం, అధికమయిన చెమట, బాలింత ఒంటి నొప్పులు, వాంతులు మొదలయినవాటికి ఇది పెట్టింది పేరు. తేనెతో కాని అల్లం రసంతో కాని పరగడపున పట్టిస్తారు.
౫. మనిషి చనిపోయే ముందు శరీరం చల్లబడితే సారంగ నాభి కస్తూరిని పట్టిస్తే వేడి పుంజుకుని (మరి వాతాన్ని తగ్గించడానికి వాడతారు అంటేనే తెలుస్తోంది కదా చల్లదనాన్ని తగ్గించి వేడిని పెంచుతుంది అని!) మనిషి బ్రతుకుతాడని నమ్మిక.
౬. గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమా, మూర్థ, నరాల బలహీనత, ధనుర్వాతం, పక్షవాతం, మొదలయినవాటికి ఇది చక్కని మందు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ముఖ్యమయినవి మాత్రం ఇక్కడ పెట్టాను. కస్తూరి శ్రేష్టతకి మారు పేరు అంటారు. శ్రేష్టమయిన పసుపుని కస్తూరి పసుపు అనీ శ్రేష్టమయిన కుంకుమని కస్తూరి కుంకుమ అనీ అంటారు.

కస్తూరిని మన కవులు మాత్రం వదులుతారా? ముఖ్యంగా వేమన శతకంలో మనకి ఈ క్రింది పద్యాలలో తారసపడుతుంది.
మృగ మదంబు చూడ మీ(ద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!
కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నా ఏ విధముగా ఐతే మంచి వాసన వెదజల్లుతుందో అదే విధముగా గొప్పవారు బయటకి ఆడంబరము లేకపోయినా గొప్ప శక్తి కలవారై ఉండును. దేనినీ రంగు లేదా హంగు చూసి మోసపోకూడదు అన్నది దీని నీతి.

కన్నె దాని మేను కస్తూరి వాసన
ముసలిదాని మేను ముఱికి కంపు
వయసుదాని మేను వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినురవేమ!

గార్ధబంబెరుగునా కస్తూరి వాసన
మిక్కుటంగ చెడుగు మేసుగాక
నుత్తమోత్తములకు వత్తురా వేశ్యలు
విశ్వదాభిరామ వినురవేమ!

వీటిని నేను ప్రత్యేకంగా వివరించ వలసిన అవసరము లేదనుకుంటాను. అంత సరళమయిన భాష వాడారు. అందులోని అంతరార్థం మీ ఊహకే వదిలేస్తున్నాను!


అవండీ నాకు తెలిసిన కస్తూరి కబుర్లు! ఇంత చదివీ చదివీ మీ కళ్ళు అలసిపోయయా? ఐతే వాటికి కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా శ్రీ రంగ రంగా నినుబాసి ఎట్లనే మరచుందురా అని పాడుతూ అలసిన కళ్ళకి విశ్రాంతి ఇవ్వండి.