Friday, January 13, 2012

పండుగ కబుర్లు ౨

ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు తరువాత ఈ పండుగలోని మిగతా విషయాల గురించి ఈ టపాలో చర్చించుకుందాం. 

బుడబుక్కల వాళ్ళు:
అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు అంటూ స్వరయుక్తంగా పలుకుతూ ఢమరుకాన్ని మ్రోగిస్తూ జరగబోయే సంగతులన్నిటినీ గమ్మత్తుగా చెప్పే ఈ బుడబుక్కల వాళ్ళ రాక ఈ పండుగకి క్రొత్త అందాన్నిస్తుంది. తెల్లటి పంచ, నల్లని కోటు, ఎఱ్ఱని తలపాగా కట్టుకుని, నడుముకి గంట చేతిలో ఢమరుకంతో వాకిట్లో నిలిచే ఈ బుడబుక్కల వాళ్ళు ఈ మధ్యన బొత్తిగా నల్లపూసవుతున్నారు. బుడబుక్కల వాయిద్యాలయిన ఉడుక్క, పలుడక్క, డుక్క, డబ్డక్క చాలా మంది చూసి కూడా ఉండరేమో! 


వీరి ప్రస్తావన త్రేతాయుగంలో వస్తుంది. త్రేతాయుగములో ఈశ్వరుడు ఢంబికాసురుడు అనే రాక్షసుడిని సంహరించి, ఆ రాక్షసుడి వెన్నుముకని బుడబుక్క గుల్లగా, నరములను తాళ్ళుగా, చర్మాన్ని మూతలుగా, మెదడుని మైనముగా ఉపయోగించి ఢమరుకం తయారుచేసి దానిని వాయిస్తూ అయోధ్యా నగర పాలకుడయిన దశరథ మహారాజు వద్దకు బుడబుక్కల వాని వేషములో వెళ్ళి నలుగురు కుమారులు పుడతారని చెప్పినట్లు ఉంది. ఈ విధముగా వీళ్ళు మన పురాణేతిహాసాల కాలం నుండి ఉన్నారని తెలుస్తోంది. వీరు మనకి జ్యోస్యం చెప్పినప్పుడు భిక్షని స్వీకరించి చల్లని ఆశీర్వచనాలు అందిస్తారు.

గంగిరెద్దు మేళం:
గంగిరెద్దు అంటే తెలియని తెలుగు వారు ఉండరు అనటంలో కించిత్ కూడా అతిశయోక్తి లేదు. దీని ప్రస్తావన కూడా మన పురాణాలలో ఉంది. గజాసుర సంహారం కోసం బ్రహ్మాది దేవతలు గంగిరెద్దు మేళం వలే, నంది గంగిరెద్దువలే, శ్రీహరి ఆ ఎద్దుని ఆడించేవాని వలే వచ్చి పరమశివునికి గజాసురుని పొట్టనుంచి విముక్తి కలిగించారని ఉంది కదా! 


గ్రామంలో ఎవరయినా చనిపోయినప్పుడు కానీ, ఏదయినా కార్యక్రమాలప్పుడు కానీ శుభం జరగటం కోసం రైతులు వారి ఆవుదూడలను గంగిరెద్దు ఆడించే వారికి దానమిస్తారు. అప్పుడు వీరు నృత్యం తదితర అంశాలలో శిక్షణను ఇచ్చి డోలు, సన్నాయిలు వాయిస్తూ మన ఇంటి ముందుకి బసవన్నను తీసుకు వచ్చి ఎన్నో విన్యాసాలు చేయించి అయ్యవారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టు అంటూ ఆడించి తగిన పారితోషకం పొందుతారు. ఈ గంగిరెద్దు నృత్యం ఎంతో ఆకట్టుకుంటుంది.

జంగమ దేవరలు:
వీరు కూడా ఈ పండుగ సమయములో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.  వీరు కూడా పురాణాల కాలం నుంచి ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే సీతాదేవిని అపహరించడానికి పరమశివుని భక్తుడయిన రావణాసురుడు జంగమ దేవర వేషంలోనే వెళ్తాడు కదా! 


తెల్లవారే సరికల్లా జోలె తగిలించుకుని, నుదుటి మీద పెద్ద పెద్ద విభూది రేఖలు పెట్టుకుని, హర హర మహాదేవ అనుకుంటూ ఒక చేతితో గణ గణ గంటలు మ్రోగిస్తూ, దిక్కులు పిక్కటిల్లేలా  శంఖాన్ని పూరిస్తూ సాక్షాత్తూ పరమశివుడే కైలాసం వదిలి ఇంటి ముందు నిలిచాడా అన్నట్టు కనిపించే వీరి ఆహార్యం అనిర్వచనీయం. ధనుర్మాస ప్రారంభ రోజు మొదలుకొని వీరు కూడా ఏక భుక్తం చేస్తూ, నేల మీద పడుకుని, నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో భిక్షాటనం చేస్తూ ఊరూరా తిరుగుతారు. వీరిని చూస్తే నాకు ఆ మహేశ్వరుడే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ముందు నిలిచినట్టు అనిపిస్తుంది. వీరు కూడా భిక్షను తీసుకుని సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదిస్తారు.

ఈ మువ్వురూ కూడా కుటుంబమంతా సుభోజ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. 

బొమ్మల కొలువు:
మనిషి అనే బొమ్మని చేసి ప్రాణం పోసి ప్రాణిగా మలిచిన బ్రహ్మ గారి సభకు ప్రతిరూపమే ఈ బొమ్మల కొలువు. ఈ సమస్త సృష్టి ఆయన కొలువులో భాగమేగా? అందుకనే రక రకాల బొమ్మలతో ఈ కొలువును ఏర్పాటు చేస్తారు. నాకసలు ఇదంటే చిన్నప్పటినుండి ఎంతో ఇష్టం ఎన్నో రకాల బొమ్మలు భద్రంగా దాచుకున్నాను. మీరు కూడా చూడండి కావాలంటే? 


బొమ్మల కొలువుకి మెట్లు బేసి సంఖ్యలో పెట్టాలి. అన్నిటికన్నా పై మెట్టు మీద దేవతా విగ్రహాలను పెట్టి, తరువాత జలచరాలు, భూచరాలు ఇలా సృష్టిలోని పరిణామ క్రమాన్ని ప్రతిబింబించేలా పెట్టాలి. ఇదివరకు దేవాలయం, జంతు ప్రదర్శనశాల, అంగడి, ఇల్లు, రాసలీల, ఇలా కొన్ని బొమ్మలే ఉండేవి కాని ఇప్పుడు బోలెడు రకాల బొమ్మలను పెడుతున్నారు. ప్రతీసారీ క్రొత్త బొమ్మ తప్పనిసరిగా చేర్చాలి. 


దీని వలన పిల్లలకి చాలా ఉపయోగాలున్నాయి. అవేమిటంటే ముందుగా పిల్లలకి పూజ చేయటం అలవాటవుతుంది. పేరంటానికి వచ్చినవారికి మర్యాదగా కుంకుమ పెట్టి, చందనం అద్ది, పసుపు రాయటం అలవాటవుతుంది. మనకున్నది పది మందితో పంచుకోవటం వాయినాలు ఇవ్వటం ద్వారా అలవడుతుంది. ఇరుగుపొరుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పిలవటం, వాళ్ళ ఇళ్ళల్లో పేరంటాలకి వెళ్ళటం వలన సత్సంబంధాలను పెంపొందించుకుంటారు. వారికున్న కళాత్మకతకి పదును పెట్టే సమయం కూడా ఇదే. 


ఎన్ని బొమ్మలున్నా సరే పసుపు వినాయకుడినీ, పసుపు గౌరీ దేవినీ పెట్టి, రెండు పూటలా ధూప, దీప నైవేద్యాలతో పూజ చేసి కర్పూరం వెలిగించాలి. ఈ బొమ్మల కొలువుని మూడు రోజులు కాని, అయిదు రోజులు కాని, వారం రోజులు కాని, తొమ్మిది రోజులు కాని ఉంచుతారు. ఎలా ఉంది మా బొమ్మల కొలువు?

మరిన్ని కబుర్లు వచ్చే టపాలో.....

 

24 comments:

జ్యోతిర్మయి said...

మీ బొమ్మల కొలువు శోభాయమానంగా ఉంది రసజ్ఞా...పండుగ సంబరమంతా నీ బ్లాగులోనే...రేపటి కోసం ఎదురుచూస్తున్నాను.

Kalyan said...

బుడబుక్కలోడి సంగతి తెలుసు కాని జంగమ దేవరుల సంగతి మాత్రం నేనెరుగను ఇది వరకు. అసలు పల్లెటూరి వాతావరణం నాకు అస్సలు తెలియదు :( . ఇలాగైన తెలుసుకున్నాను అనే సంతోషం . బొమ్మల కొలువు మాత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది ఎందుకంటే బొమ్మను చేసి ప్రాణము పోసిన దాని విశిష్టతను బాగా వివరించారు. కాని ఈ కాలంలో ఇవన్నీ ఎక్కడ కనిపించట్లేదు . ఇప్పటికి వీటిని అనుసరిస్తునందుకు చాలా సంతోషం పైగా వాటిని గుర్తుగా బద్రంగా పెట్టుకోవడం అనేది వాటికి మీరిచ్చే విలువ ఎంతో బాగుంది. ఇంకా సరాసరి కిందకి వస్తే ఆ కాగితపు బొమ్మలు ఉన్నాయి చూసారు అవి మీ కలాత్మతకు నిదర్శనాలు. అ చొక్కా నాకు ఇవ్వండి ;) .

బొమ్మకు తోడు బొమ్మలు
అ బొమ్మల కొలువుకు అతిధులు
ఇచ్చారు ఇచ్చారు వాయనాలు
అది అందరి శ్రేయసుకు ఉపకరణాలు

మా అందరి తోడ్పాటు ఎప్పటికి ఉంటుందని మనవి చేస్కుంటూ ఈ సంక్రాంతి సుభ సంధర్బంలో మీ ప్రయత్నాలు జీవం పోసుకోవాలని కోరుకుంటున్నాము.

PALERU said...

happy pongal .... bamma gaaru

PALERU said...

:):) forgotted in last coomment ....

Murthy said...

ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరకూ "సంక్రాంతి శుభాకాన్షలు.
రసజ్ణ గారు చలా చక్కటి, విలువయిన, ప్రస్తుత తరానికి కావలసిన వివరాలు అందించారు. ఇందుకు మనస్ఫూర్తికి మీకు ధన్యవాదములు.
కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, శయనెషు రంభ, భోజ్యేషు మాత, క్షమయ ధరిత్రి, ఇది అందరికీ తెలిసినదే.........
మొట్టమొదటినుండి మన భారతీయ సన్స్కృతి, సాంప్రదాయంలో "స్త్రీ" కి చాలా ఉన్నతమయిన స్థానం ఉన్నది. భావదాశ్యంలో మునిగి, మన దేశ సామాజిక, సాంఘీక, భౌగోళిక స్వరూపాలకు ఇమడని, అనవసరమయిన పాశ్చాత్య సాంప్రాదాయాలను ఒంటికి పూసుకున్న దానిలో మొదటిది "స్త్రీ" ని విలాస వస్తువుగ చూడటం వలన, ప్రకృతి సిధ్ధమయిన, సహజమయిన అందాలను చూడలేకపోవటము మన దురదృష్ఠకరం. ప్రతి పండుగలలోనే కాకుండా నిత్య జీవితంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక కుటుంబం యొక్క ఉన్నతమయిన అభివృధ్ధికి మూలస్థంభంగా నిలిచే, "స్త్రీ" పాత్ర లేకుండా ఏమీ జరగలేదు, జరగదుకూడ. ఇది సత్యం.

♛ ప్రిన్స్ ♛ said...

!! రసజ్ణ !!గారు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈ సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!!

రాజ్యలక్ష్మి.N said...

రసజ్ఞ గారూ సంక్రాంతికి మాత్రమే ప్రత్యేకమైన
వేడుకలను చక్కగా పరిచయం చేస్తున్నారండీ..
మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

Anonymous said...

సీరియల్ పూర్తి అయిన తరవాత చెబుతా. సంక్రాంతి శుభకామనలు.

జయ said...

ఈ మూడు రోజులు మీ ఇంట్లోనే నండి, మా పండుగ. ఇంక పొమ్మన్నా పోయేట్లు లేను నేను. మీకు కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

పండుగ గురించి అన్ని విషయాలు చక్కగా వివరించారు . మా మనవడి వ్యాసం కోసం మీ పోస్ట్లో నుంచే పాయింట్స్ ఇస్తాను . బాగుంది . నాకు పాయింట్స్ వెతికే పని తప్పించారు . థాంక్ యు :)
సంక్రాంతి శుభాకాంక్షలు .

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీకు మీ కుటుంబ సభ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

చాలా బాగుంది మీ టపా.

Unknown said...

అబ్బో రసజ్ఞగారూ! పండగంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది. అసలు పండుగ అంతా మన పిండి వంటల్లోనే కదా! అరిసెలు, పోకుండలు,సున్నుండలు, ఇవన్నీ మర్చిపోయారేంటీ.ఇవెప్పుడు చూపెడతారూ! ఏమైనా ఈపండక్కి మీ బ్లాగు మంచి కాలక్షేపం. మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు.

Sai said...

రసజ్ఞ గారు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

వనజ తాతినేని/VanajaTatineni said...

రసజ్ఞ ..పోస్ట్ చాలా విలువైనదిగా ఉంది. ఒక విషయం ఏమంటే నిత్యం డమరుక ధ్వనం విన్న చోట ,చేసిన చోట.. నిత్య శుభాలకి కొలువట. ఇది పెద్దలు చెపిన మాట.

Lasya Ramakrishna said...

రసజ్ఞ గారు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

Ramakrishna said...

రసజ్ఞ గారు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

Balu said...

అచ్చతెలుగు అరిసె తిన్నట్టుగా ఉందంటే నమ్మండి.

రసజ్ఞ said...

@ జ్యోతిర్మయి గారూ
మా బొమ్మల కొలువు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ కళ్యాణ్ గారూ
హహహ పోనిలెండి ఈ వంకనన్నా పల్లెటూరి వైపు తొంగి చూసారు! అవునండీ ఇప్పటికీ చాలా బొమ్మలు కొనుక్కుని దాచుకుంటాను భద్రంగా! ఇహ నేను చేసిన బొమ్మలు నచ్చినందుకు సంతోషం. ఆ చొక్కా మాత్రం స్టాక్ లేదు నిన్ననే లేవిస్ వాళ్ళు కోనేసుకున్నారు పెద్ద మొత్తంలో పైకం చెల్లించి కనుక ఈ సారి బెట్టర్ లక్ ;) ధన్యవాదాలు!

@ రాఫ్సున్ భాయ్
ధన్యవాదాలు! మీరెలా పిలిచినా నాకు భాయ్ కనుక మీ ఇష్టం ;)

@ DSR మూర్తి గారూ
చాలా చక్కగా చెప్పారండీ! ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ తెలుగు పాటలు గారూ
మీ హృదయపూర్వక అభిమానానికి ధన్యవాదాలు!

@ రాజి గారూ
మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ! ఈ సారి తప్పక కోనసీమ వస్తారు కదూ ఇవన్నీ చూడడానికయినా!

@ తాతగారూ
సీరియల్ పూర్తి అయ్యిందండీ! ధన్యవాదాలు!

@ జయ గారూ
అంత కన్నా మహాద్భాగ్యమా? తప్పకుండా వచ్చి ఉండండి. ధన్యవాదాలండీ!

రసజ్ఞ said...

@ మాలా కుమార్ గారూ
మీకు అంత మంచి ఇన్ఫో ఇక్కడే దొరికింది అన్నందుకు చాలా ఆనందంగా ఉంది! తప్పకుండా ఇవ్వండి. ధన్యవాదాలు!

@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
మీకు నచ్చినందుకు, మీ శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు!

@ ఫణి గారూ
హహహ భలే చెప్పారే! నిజమే అండీ పిండి వంటలే పెద్ద పని నిజానికి! ధన్యవాదాలండీ మీకు నా బ్లాగు మంచి కాలక్షేపాన్ని ఇస్తున్నందుకు!

@ సాయి గారూ
ధన్యవాదాలండీ!

రసజ్ఞ said...

@ వనజ వనమాలి గారూ
పెద్దల మాటని చక్కగా అందించారు. ధన్యవాదాలు మీకు నచ్చినందుకు!

@ లాస్య గారూ
ధన్యవాదాలండీ! మీకు కూడా!

@ రామకృష్ణ గారూ
ధన్యవాదాలండీ! మీకు కూడా!

@ బాలు గారూ
వావ్ అవునా? అయితే ఇంకేం? ఎంచక్కగా ఆస్వాదిస్తూ తినేయండి మరి! ధన్యవాదాలు!

Unknown said...

"మనిషి అనే బొమ్మని చేసి ప్రాణం పోసి ప్రాణిగా మలిచిన బ్రహ్మ గారి సభకు ప్రతిరూపమే ఈ బొమ్మల కొలువు"....
అంటూ బొమ్మల కొలువు విశిష్టతతోబాటు కనుమరుగవుతున్న బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దు మేళం, జంగమ దేవరలు ఇవన్నీ ఎంతో వివరంగా విశ్లేషించి చెప్పారు. పండుగలూ, పూజలూ అందరూ చేసుకుంటారు....కానీ వాటి విశిష్టత తెలుసుకుని చేసుకోవటంలోనే ఉంది నిజమైన పండుగ...
వండర్ ఫుల్ అండీ!

రసజ్ఞ said...

@ చిన్ని ఆశ గారూ
చక్కగా చెప్పారు. మనం చేసేవన్నీ ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని ఆచరిస్తేనే వాటికి సార్ధకత చేకూరుతుంది. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

Anonymous said...

Woah! I'm really loving the template/theme of this site.
It's simple, yet effective. A lot of times it's difficult to get that "perfect balance" between usability and appearance.
I must say you have done a very good job
with this. Additionally, the blog loads super quick
for me on Safari. Excellent Blog!

Feel free to visit my page dating online (bestdatingsitesnow.com)