Wednesday, November 23, 2011

పద్య యత్నం



ఈ మధ్యన మా లాబులోనే కాకుండా ప్రతీ దాని మీదా ప్రయోగాలు చేయాలని చేతికి చాలా దురదగా ఉంది. అందుకే దురద తగ్గించు కోవడానికి పిల్స్ కన్నా పెన్ను, బిళ్ళల కన్నా బ్లాగు, ఇంజెక్షను కన్నా ఇంటర్నెట్టు, కషాయం కన్నా కీబోర్డు మంచివని ఈ నా యత్నం! అయినా మనకి పెద్దలు చెప్పనే చెప్పారు కదా! ఏమని అంటారా?

Past is an experience
Present is an experiment
Future is an expectation
So use your experience in your experiment to reach your expectations 

అని. కనుక అదే దారిలో సాగిపోతూ.. ఇంతకముందు చదివిన వేమన, సుమతీ, భర్తృహరి శతకాలు experience అయితే, ప్రస్తుతం నేను వ్రాసినవి నా experiment అనమాట. ఇహ expectation ఏమిటి అంటారా? ఏముందండీ ఎప్పటికయినా నేను కూడా గణ విభజనలతో చక్కగా ఛందోబద్ధంగా పద్యాలు వ్రాయడం. ప్రస్తుతానికి నా ఈ మొదటి ప్రయోగం ఎలా ఉందో చెప్పండి! 

తల్లిదండ్రులను సుఖపెట్టని తనయుడెందుకు?
తన స్వార్ధమే చూసుకునే మనుజుడెందుకు?
పరులకు కీడు చేసే జీవుడెందుకు?
విరిసిన పూల తోట రసజ్ఞ మాట!

 మృగరాజు బలిమి మూషికమునకేమేరుక?
కలను కూడా భీతి జెందు గజరాజుకెరుక!
అయ్యవారి గొప్ప అల్పునకేమేరుక?
విరిసిన పూల తోట రసజ్ఞ మాట!

పాఠకులు లేని బ్లాగులో నీరసముంది 
వ్యాఖ్యలు లేని టపాలో నిరాశ ఉంది
బలాన్నిచ్చే ఒక్క స్పందనలో ప్రోత్సాహం ఉంది  
విరిసిన పూల తోట రసజ్ఞ మాట!

హహ బేసికల్గా ఇంత poetry చదివాక మీ పరిస్థితిని నేను అర్ధం చేసుకోగలను. నా మీద అసూయగా ఉంది కదూ! (లేదని మాత్రం చెప్పద్దే! ఏదో ఇలా తుత్తి పడనివ్వండి!) చంటబ్బాయి చిత్రంలో శ్రీలక్ష్మి గుర్తొచ్చిందా? వచ్చే ఉంటుంది లెండి! అయితే ఇప్పుడు చెప్తున్నా చదవండి! నేను వ్రాసినవి పద్యాలు కాదన్న వాళ్ళని బ్లాగులో టపాని, టపాల్లో వ్యాఖ్యలని పుచ్చుకుని కొడతా! ఖబడ్దార్!

Thursday, November 17, 2011

పాట ప్రయత్నం


సాకీ:
అమ్మంటే అనురాగపు పెన్నిధి
అమ్మంటే మమకారపు సన్నిధి

పల్లవి:
యుగయుగాలుగా జగమునేలేది అమ్మ
తరతరాలుగా తరగని ప్రేమ గని అమ్మ
అమ్మ దీవిస్తే లోకాన ఎదురే లేదుగా

చరణం ౧:
దైవానికి మారుగా భూ వెలసిన దేవత
పుణ్యానికి ఫలితంగా జన్మనిచ్చిన దాత
త్యాగానికి మారుగా తన రక్తాన్నే పంచును
సహనానికి రూపంగా మన తప్పుల్ని కాచును
తప్పటడుగు వేశావంటూ మనల్ని తప్పు పట్టదు
అమ్మ ఒడి స్వర్గము అమ్మ పాలు అమృతము
అమ్మ పలుకు వేదము అమ్మ పాట ప్రణవ నాదము
లాలించి పాలించేది అమ్మ ప్రేమ ఒకటే!!

చరణం ౨:
దేవుళ్ళకు జన్మనిచ్చి దేవతగా మారెను
పాపులను పరి మార్చేటి కాళికా దేవి
వెన్నెలకు మారుగా అమ్మ ప్రేమ చల్లన
అమ్మ మనసు నిజంగా మల్లె కన్నా తెల్లన
తప్పులు సరి చేసి రెప్పవలె మనులను కాచును
అమ్మలోనే సృష్టంతా కదులును అమ్మతోనే సృష్టంతా మొదలవును
  ఆవు పాలు స్వచ్ఛము అమ్మ ప్రేమ సత్యము
లాలించి పాలించేది అమ్మ ప్రేమ ఒకటే!
 

Monday, November 14, 2011

బాల్యాలు



ముందుగా అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు!


మొదటి బాల్యం: అమాయకత్వం, ఏదో తెలుసుకోవాలనే తపన, ప్రతీదీ ఆశ్చర్యంతో కూడిన ఆనందం తలుచుకుంటేనే ఒక గొప్ప అనుభూతి కదూ. అవే పిల్లలకి అందం. అసలు వాళ్ళ బోసినవ్వులే అమృత తుల్యమన్నారు కదా పెద్దలు. పిల్లలున్న ఇల్లు స్వర్గంతో సమానం. తల్లిదండ్రుల ఒడిలో, అమ్మమ్మ లేదా నానమ్మ తాతయ్యల గారాల లాలనలో పాలనలో మంచి విద్యాబుద్ధులతో పాటు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వారి అమాయకపు చేష్టలతో ముద్దులొలికిస్తూ బాధలన్నిట్టినీ మరపించి మురిపించే చిన్నపిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో బరువు (స్కూల్ బ్యాగ్గులు) బాధ్యతలు (పరీక్షలు) మోస్తూ ఒత్తిడిని (ఫస్ట్ ర్యాంకు రాకపోతే కోప్పడతారన్న టెన్షన్) నెత్తిన వేసుకుని ఈ చదువులెవడు కనిపెట్టాడురా బాబూ అనుకునేలా చేస్తున్న స్కూల్ వాతావరణం ఒక ప్రక్క. చక్కగా ప్రకృతితో ఆడి పాడి స్వేచ్ఛగా ఉండవలసిన వయసులో వాన నీటిలో కనీసం కాగితపు పడవలు కూడా వేయలేని జీవితం మరొక ప్రక్క. ఇది వీళ్ళకి వరమా? శాపమా?  కొబ్బరి చెట్టు క్రింద పడుకుని ఉన్న తాతయ్య పొట్ట మీద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఎన్నో చందమామ కథలను చెప్పించుకోవలసిన వయసులో ఎవరి గదుల్లో వాళ్ళు కృత్రిమ చందమామని చూసి సరిపెట్టుకోవలసి వస్తోంది. 

ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవలసిన బాల్యంలో ఆయాసంతో కూడిన అలసటని మిగుల్చుకుంటున్నారు.  చెమ్మ చెక్కలు, గుడు గుడు గుంజాలు, వాన వాన వల్లప్పలు, కాళ్ళా కజ్జాలు ఏమయ్యాయి? స్కూబీ డూబీ షోలు, పోకీమన్లు, పవర్ రేంజర్లు, మాంస్టర్ వారియర్లు మింగేశాయా? పిప్పరమెంటు బిళ్ళలు, గొట్టాలు (గోల్డ్ ఫింగెర్స్), నిమ్మ తొనలు, మొదలయిన వాటిని పిజ్జాలు, బర్గర్లు, పఫ్ఫులు తొక్కేసాయేమో? కోడి పందెం పువ్వులు, ఏడు పెంకులాటలు, ఉప్పులగుప్పలు ఎక్కడికి వెళ్ళాయో? బాల్యాన్ని ఒక కృత్రిమం అనే రాకాసి మింగేసి ఎన్నో జ్ఞాపకాలని లేకుండా చేస్తోందేమో అనిపిస్తోంది. ఏదేమయినా బాల్యం అనేది ఒక వరం. దానిని వారి నుండి దూరం చేయకండి, హాస్టళ్ళలో పెట్టి పసి మనసులని బాధ పెట్టకండి. ఆప్యాయతల విలువ తెలియనివ్వండి. యాంత్రికంగా మార్చకుండా సహజత్వాన్ని కోల్పోకుండా ఉంచితే దానిని మించిన వరం లేదు. నేటి బాలలే రేపటి పౌరులు. 

రెండవ బాల్యం: వార్ధక్యం రెండవ బాల్యం అన్నారు. ఆలోచించి చూస్తే నిజమే అనిపిస్తుంది నాకు. జీవితమనే బండిని ఎద్దులాగా లాగి లాగి అలసిపోయి ఒక ఆదరించే, స్వాంతన పొందే చేతి కోసం ఎదురు చూసే వాళ్ళు బాలలే. వీళ్ళ బోసి నవ్వులలో పిల్లల బోసినవ్వులంత స్వచ్ఛతా ఉంది. వీళ్ళకున్నది అపూర్వమయిన జ్ఞాన సంపద, ఎంతో అనుభవంతో కూడిన ఆలోచన. కానీ వారి మాటలను మనమే పెడచెవిన పెడతాం. వృద్ధాప్యంలో ఎంత డబ్బు ఉన్నా నేనున్నాను అని అక్కున చేర్చుకోవలసిన కన్నపిల్లలే భారమని తల్లిదండ్రులని వదిలేసిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. రాజమండ్రి గౌతమీ జీవ కారుణ్య సంఘంలో నాకెదురయిన కొంతమంది ద్వారా నేర్చుకున్న పాఠం ఇది. వాళ్లకి చాలా మంది సహాయం చేసి చేతులు దులిపేసుకుంటారు. వాళ్ళు కోరేది సహాయం కాదు అని నాకు అక్కడకి వెళ్ళిన మొదటి రోజు తెలిసింది. ఒక పెద్దావిడ దగ్గర కుర్చుని క్షేమ సమాచారాలు అడుగుతుండగా ఆవిడ చెప్పింది మాకు చాలా ఆస్థి పాస్థులు ఉన్నాయి కానీ ప్రేమగా చూసే చేయి లేక ఒక తియ్యని పలకరింపుకి నోచుకోలేక ఇక్కడ ఉన్నాను అని. ఆ సంఘటన నన్ను కదిలించింది. అప్పటినుండి ఎప్పుడు సమయం చిక్కినా వాళ్ళ దగ్గరకి వెళ్లి కాసేపు కబుర్లు చెప్పి ఆప్యాయంగా పలకరించి వచ్చేదానిని. కనుక నా అనుభవంతో నేను అందరికీ చేసుకునే విన్నపం ఒకటే. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న వారిని రెండవ బాల్యంలో వదిలేయకుండా వారి ఋణం తీర్చుకునే అవకాశాన్ని జార విడువకండి. మనల్ని చేయి పట్టుకుని నడిపించిన వాళ్లకి అవసర సమయంలో చేయూతనివ్వండి. ప్రేమగా ఒక స్పర్శ, ఆప్యాయంగా ఒక కమ్మని పలకరింపు చాలు వీళ్ళకి. నిండు మనసుతో చేసే వాళ్ళ ఆశీర్వాదాలే మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి అని మర్చిపోకండి. దయచేసి వాళ్ళని వృద్ధాశ్రమాలలో వదిలేయకండి!

Friday, November 11, 2011

గోపాలుని చేతిలో కుంచె


క్రితం వారం టపాకి లభించిన ఆదరణని బట్టి చూస్తే నా లాగా చిత్రకారుల్ని ఇష్టపడే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారనిపించింది. అందుకనే మరొక చిత్రకారునితో మీ ముందుకి వచ్చాను! ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గోపాల్ స్వామి ఖేతంచి. ఈయన శైలిలో కాల్పనికత, లోతయిన వాస్తవికత ఆకట్టుకునే అంశాలు.

 
ఆయన నగిషీలు పెట్టడములో నేర్పరి అనిపిస్తుంది నాకు. పురాతన ఫ్రెంచు, స్పానిష్, మొదలయిన  చిత్రాలని తీసుకుని మన భారతీయతను ఎంతో అందముగా తొడిగి మన ముందుకి తీసుకువచ్చిన వ్యక్తి ఈయన. ఏంటి నమ్మరా? కావాలంటే ఈ బొమ్మను చూడండి పేరు ప్రఖ్యాతలు, వివదాస్పదమయిన చర్చలు రేపిన మోనాలిసా చిత్రాన్ని తనదయిన శైలిలో కుంచెకు, మెదడుకు పదును పెట్టి భారతీయ దుస్తులలో ముద్దుగుమ్మగా మలచిన ఈయనని అభినందించకుండా ఉండలేమేమో!


ఈయన ఉత్తర రాజస్థాన్లో సంస్కృతికి మారుపేరుగా నిలిచే ఒక కుగ్రామములో 1968 లో జన్మించారు. జైపూర్లో ఉన్న రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి డ్రాయింగ్ మరియు పెయింటింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక చలన చిత్రాలలో మజూర్ ఉల్ హక్ కు ఒక సహాయక కళా దర్శకునిగా (Assistant Art Director) పనిచేశారు. ఆ తరువాత ఒక పత్రిక కోసం పని చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన దృష్టిని సంపూర్ణంగా కేవలం చిత్రాల మీదే లగ్నం చేసి లెక్కలేనన్ని బహుమానాలను అందుకున్నారు. ఈయన కుంచె వాస్తవికత,  సర్రియలిజం మరియు సంగ్రహణ మీదుగా ప్రయాణం చేసి సంప్రదాయం, ఆధునీకరణలను సమీకరించుకుని వీక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. 

ఆయన గీసిన చిత్రాలలో నాకు నచ్చినవి కొన్ని! ఒకసారి కళ్ళని అలా విహారానికి పంపండి మరి!

Tuesday, November 08, 2011

హేయ్ దొంగా.........


ఉన్నట్టుండి దొంగల మీద ఈ దండయాత్ర దేనికి అనుకోకుండా కాస్త ఓపికగా చదవండి! దొంగతనం అనేది మనకున్న 64 కళలలో ఒకటి. దీనినే చోర విద్య అంటారు. దీనికి అసలు గుర్తింపే లేదు. నా టపా చదివాకన్నా గుర్తిస్తారేమో చూద్దాం.

కాసేపు నిజమయిన దొంగల (పని దొంగ, గజ దొంగ, ఇంటి దొంగ,మొ.) గురించి కాకుండా ప్రతీ మనిషిలోను ఉండే సాధారణ దొంగ లక్షణాల గురించి మాత్రమే సరదాగా మాట్లాడుకుందాము. సరే ముందు ఈ విషయం చెప్పండి మీలో ఎంతమందిని ఇప్పటిదాకా కనీసం ఒక్కరయినా అమ్మ దొంగా! అని అన్నారు? గారంగా ముద్దుగా అవనీయండి కోపంగా కానివ్వండి అనే ఉంటారు కదా! నన్ను మాత్రం చాలా మంది అన్నారు లెండి. ఇవాళ ప్రొద్దున్న మా అమ్మ కూడా నన్ను దొంగ మొఖం అనేసింది అందుకే ఈ టపా. నాలాంటి దొంగ మొఖాలు ఇంకా ఇక్కడ ఎవరయినా ఉన్నారా లేదా అనే ఆలోచనతో మా అమ్మకి నేను ఇచ్చిన క్లాసుని ఇక్కడ వ్రాస్తున్నా.

ప్రపంచమంతా దొంగల మయమే! ప్రకృతంతా కూడా ఒక పెద్ద దొంగల ముఠానే లేకపోతే
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
అనే పాట పుట్టేదే కాదు. (ఈ పాటని చూసి మీరే చెప్పండి! నా మాట ఒప్పుకుని తీరతారు)

ఇదే కాక మనం దొంగతనాలు సరదాకి  చేస్తాం, ఆటపట్టించడం కోసం, ఆత్మసంతృప్తి కోసం చేస్తాం అలానే ఒక్కోసారి తెలియకుండా కూడా చేసేస్తాం. ఎలా అంటారా చెప్తాను చూడండి!


సరదా దొంగతనం: ఇది చిన్నప్పుడు అందరూ చేసే ఉంటారు. చిత్రంలో చూపించినట్టు మనింట్లో అన్నీ ఉన్నా సరే వేరే వాళ్ళ తోటలోకెళ్ళి మామిడికాయలో, జామకాయలో, నేరేడు పండ్లో, పువ్వులో ఏదో ఒకటి ఎవరికీ తెలియకుండా కోసేస్తాం ఇదే సరదా దొంగతనం అన్నమాట! ఇటువంటివి నేను మొదటిసారి నా ఇంటర్లో చేసాను. దొంగిలించిన కాయ రుచి నీకేం తెలుసని ఏడిపిస్తే పంతం కోసం చేశాను కానీ తిన్నాక నిజమే అనిపించిందండోయ్.

ఆటపట్టింపు దొంగతనం: ఇది ప్రియమయిన వాళ్ళతో చేస్తూ ఉంటాం. ఇది తాత్కాలిక దొంగతనమే ఎందుకంటే మళ్ళీ వాళ్లకి తిరిగిచ్చేస్తాం. ఎదుటి వాళ్లకి బాగా ఇష్టమయిన లేదా అవసరమయిన దానిని ఏదో ఒకటి దాచేసి లేదా కాసేపు ఊరించి ఊరించి బ్రతిమాలించుకుని ఇచ్చేస్తాం. దీనిలో మా చెడ్డ ఆనందం ఉంటుంది.

ఆత్మసంతృప్తి దొంగతనం: ఇది కూడా అందరం చేస్తూ ఉంటాం. మనకిష్టమయిన వాళ్ళ వస్తువేదో దాచేసుకుంటాం వాళ్ళ గుర్తుగా. అడిగి తీసుకోవచ్చుగా? కాని అడగం ఎందుకంటే సొంతమనే భావన పైగా అడిగితే వాళ్ళు నవ్వేస్తే మళ్ళీ సిగ్గు కూడాను మనకి. అందుకని ఇలా చేస్తూ ఉంటాం.

తెలియని దొంగతనం: నిజమే మనకి తెలియకుండానే మనం చాలా దోచేసుకుంటాం ఎదుటి వాళ్ళ దగ్గరనించి. అవే మనసు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత మొదలయినవన్నీనూ. అసలు కళాకారులు, మన బ్లాగర్లందరూ కూడా ఈ కోవకి చెందిన పేరుమోసిన దొంగలే. ఈ హారంలో పెద్ద దొంగల గుంపు ఉందండి బాబు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎవరు మీ అభిమానాన్ని దోచేసుకుంటారో?

ఇప్పుడు ఒప్పుకుంటారా? అందరం దొంగలమని! మీలో ఎంతమంది దొంగలో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండే?

Friday, November 04, 2011

కుంచె పట్టిన ఇళయరాజా

ఏమిటబ్బా ఈ అమ్మాయి ఇళయరాజా అని ఈయన ఛాయా చిత్రం పెట్టింది అనుకుంటున్నారా? నేను చెప్పదలచుకున్నది అక్షరాలా ఈ ఫోటోలోని వ్యక్తి గురించే! ఈయన పేరు ఎస్. ఇళయరాజా. ఈయన ఒక గొప్ప చిత్రకారుడు అనడం చిన్న మాటవుతుందేమో!
 
ఈయన గురించి చెప్పాలంటే ఈయన గీసిన చిత్రాల ముందు మాటలు చిన్నబోతాయేమో? ఎందుకంటే ఈయన చిత్రాలు ఎంతో చక్కగా, అద్భుతమయిన భావాలని పలికిస్తూ ఉంటాయి. ఆయన కృషి, గీయడం మీద ఆయనకి ఉన్న శ్రద్ధ, ఆసక్తి ఆయన గీసిన ప్రతీ చిత్రంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఈయన చిత్రాలు రవి వర్మ గారి చిత్రాలను గుర్తు చేస్తూ ఉంటాయి. అందువలననేనేమో ఈయనని అందరూ నేటి రవి వర్మ అని పిలుస్తూ ఉంటారు! 

ఆయిల్, వాటర్ కలర్స్, కత్తి, అక్రిలిక్ మొదలయిన వాటితో బొమ్మలు గీయడంలో ఆయన చేయి తిరిగిన వ్యక్తి. ఆనంద వికటన్ అనే తమిళ వారపత్రిక ద్వారా జనాలకి పరిచయం అయ్యి ఒక సుస్థిరమయిన స్థానాన్ని సంపాదించుకున్నారు.  

ఈయన ఏప్రిల్ 19 , 1979 లో తమిళనాడులో జన్మించారు. ఈయన BFA (Bachelor of Fine Arts, 1996-2001)ని కుంబకోణం ప్రభుత్వ కళాశాలలో, MFA (Master of Fine Arts, 2001-2003)ని చెన్నై fine arts కళాశాలలో చేశారు. 

ఈ వృత్తిలోనే స్థిరపడ్డారు. అప్పటినుండి ఊపిరినే కుంచెగా మలచి చిత్రాలకి ప్రాణం పోశారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడే ఈయన చిత్రాలు వీక్షకుల హృదయాలని దోచుకున్నాయి. సహజత్వంతో పాటు, పల్లె పడుచుల అమాయకత్వాన్ని కూడా ఈయన చిత్రాలు ప్రతిబింబిస్తాయి. తుమ్మెద రెక్కలంత మృదువయిన కుంచెని వాడతారో ఏమో? అసలు అవి ఛాయాచిత్రాలా లేక గీసిన చిత్రాలా అనే సందేహం తప్పక కలుగుతుంది! రోజువారీ ఒక మహిళ చేసే పనులన్నీ ఈయనకి స్ఫూర్తే. ద్రావిడ మహిళ అనే పేరుతో ఆయన గీసిన చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆయన గీసిన వాటిల్లో నాకు నచ్చిన కొన్ని చిత్రాలను ఇక్కడ చూడవచ్చును.