Tuesday, September 27, 2011

కర్పూర కథ


దేవీ నవరాత్రులు మొదలయ్యాయి కదా! ఇకనించి రోజూ పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు. అసలు పూజలనగానే నాకు బాగా గుర్తొచ్చేది హారతి. ఎందుకంటే అదిచ్చేస్తే పూజలు అయిపోయినట్టే మనకి ఎంచక్కగా ప్రసాదం పెడతారు. అందుకనమాట. భగవంతునికి చేసే ఉపచారాలలో ఈ హారతి ఒకటి. కావున ఈ హారతి గురించి నాకు తెలిసిన కొన్ని ముక్కలు వ్రాయతలచాను.

కర్పూరం చంద్ర సంకాశం జ్యోతి స్సూర్య మివోదితం
భక్త్యా దాస్యామి కర్పూర నీరాజన మిదం శివం
 

అంటూ కర్పూరంతో ఇచ్చే హారతిని నీరాజనం అంటారు. ఇంతే కాక  హారతిని నేతిలో నానబెట్టిన దూది వత్తులతో కూడా కొన్ని సందర్భాలలో ఇస్తారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, పదకొండు, పదహారు, ఇరవై ఒకటి ఇలా వివిధ సంఖ్యల వత్తులతో హారతులిస్తారు. కర్పూరము శ్రేష్ఠమయినది  కనుక దాని గురించి కొంచెం క్లుప్తంగా వ్రాస్తాను.

కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. పురాతన కాలంలో స్వల్పంగా దీపాల కాంతి ఉన్నపుడు భగవంతుని రూపం అంత స్పష్టంగా కనిపించేది కాదు. అప్పుడు హారతి ఇస్తే ఆ వెలుగులో చక్కగా స్పష్టంగా భగవంతుని మూర్తిని దర్శించే భాగ్యం భక్తులకు కలిగేది. హారతి సంప్రదాయానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి ఇది ఒక కారణం కావచ్చును. అయితే హారతి ఇవ్వడానికి ప్రధాన కారణం దిష్టి తీయడం. ఇదే కాక కర్పూరం వెలిగించినప్పుడు కమ్మని వాసన వస్తుంది. కర్పూర వాయువు గాలిని శుభ్రపరుస్తుంది. హారతిని కళ్లకు అద్దుకునే సమయంలో భక్తులా గాలి పీలుస్తారు. అప్పుడందులోని ఔషధగుణాలు శరీరం లోపలి భాగాల్ని శుద్ధి చేస్తాయి. ఇదే హారతి వెనుకనున్న నిగూఢమయిన రహస్యం.

పుట్టుక: కర్పూరం బహువచనం లేని ఏకవచనం. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.

కర్పూర పూలు
 ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. నిజమే అండి కర్పూరం  కాంఫర్ లారెల్  లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ )  అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.

రకములు : కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది. 

పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు.  దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు. 

హారతి కర్పూరం
హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు. 

రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో  ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.

భీమసేని కర్పూరం
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.

సితాభ్ర కర్పూరం
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.




హిమవాలుక కర్పూరం
హిమవాలుక కర్పూరం:  ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.

ఘనసార  కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది. 

హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.

ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరముభూతికము, లోక తుషారముశుభ్ర కరముసోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి. 

ఉపయోగాలు: కర్పూరం వలన చాలా రకముల ఉపయోగాలున్నాయి. అవేమిటంటే
స్వభావం-కర్పూరం: మనుషుల స్వభావాలని కర్పూరంతో పోలుస్తారు. రకం మనుష్యులకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఏది చెప్పినా ఇట్టే గుర్తుండి పోతుంది. అంటే ఏకసంతాగ్రాహులన్నమాట. మంచి విషయాలను వెంటనే ఆచరణలో పెడతారుకర్పూరం లాంటి స్వభావం కలవారు కనుక ఒక సారి వెలిగిస్తే చాలు, చుట్టూ ఉన్న అందరినీ వెలిగిస్తూ జ్ఞానాన్ని పంచుతారు.

సాహిత్యం-కర్పూరం: మనకి కర్పూరాన్ని ఉదాహరణగా చూపిస్తూ బోలెడు మంచి విషయాలను మన సాహిత్యంలో చెప్పారు. వాటిల్లో మనందరికీ బాగా తెలిసిన రెండు పద్యాలు:

ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ.
పద్యం తెలియని వాళ్ళు ఉండరు కదా! ఉప్పు, కర్పూరం ఒకే విధముగా కనిపించినా కానీ పరిశీలించి చూస్తే వాటి రుచులు, గుణములు వేరు వేరుగా ఉంటాయి. విధముగానే మనుషులంతా చూడటానికి ఒకే ఆకారంతో, ఒకే అవయవ లక్షణాలను కలిగి ఉన్నా, గొప్పవారి లక్షణములు పరిశీలించి తెలుసుకుంటే, మామూలు మనుషులకంటే వారు విలక్షణముగా ఉంటారు అని దీని భావము.

కప్పురంపు మనసు కాంక్షించు యోగికి
జ్ఞానదీప శిఖయు తానటించు
కానవచ్చు నాత్మ క్రమమాణమై నిచ్ఛ
విశ్వదాభిరామ వినురవేమ.
కర్పూరం లాంటి స్వచ్ఛమైన మనసును అలవరచుకునే పవిత్రులలో జ్ఞానజ్యోతి (తత్వజ్ఞానమన్నమాట) వెలిగి, ఒకానొక ఆత్మస్ఫురణ కలుగుతుంది. అది క్రమంగా అతని అనుభవంలోకి వస్తుంది. అతడు కోరుకున్న ముక్తిని అప్పుడు పొందుతాడు అని అంటారు వేమన. ఇక్కడ దీప శిఖ అంటే దీపం యొక్క కొన, అగ్ని జ్వాల. నటించు అంటే ప్రవర్తించడం. ఇచ్ఛ అంటే కోరిక. అలభ్య వస్తువును సంపాదించడం కోసం కలిగే సంకల్పాన్ని ఇచ్ఛ అంటారు. ఇక్కడ ఇచ్ఛకు పర్యవసానం ముక్తి అని అంతరార్థం.

కళ్యాణం-కర్పూరం: చదవడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కళ్యాణాలలో కర్పూరానికి ఒక ప్రత్యేకత ఉంది. వధూవరులు దండలు మార్చుకునేటప్పుడు ఈ కర్పూర దండలు తప్పక మార్చుకుంటారు. అవి వాళ్ళు తీసి పక్కన పెట్టడం ఆలస్యం మేమంతా వెళ్ళి తెగ ఆడుకునే వాళ్ళం. 

ద్రిష్టి-కర్పూరం: నీరాజనం అంటే దేవునికి ద్రిష్టి తీసే ప్రక్రియే. సినిమాల పుణ్యమా అని ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ తెచ్చేసి దాని మీద బండ రాయ పరిమాణంలో ఉండే పెద్ద కర్పూరం వెలిగించేసి మరీ ద్రిష్టి తీసేస్తారు. అదే కాక ఒక పెద్ద కర్పూరం వెలిగించి దానిని రెప్ప వేయకుండా చూస్తుంటే మన కంట్లో నీరు ఎంత కారుతుందో లేదా మన కళ్ళు ఎంత మండుతున్నాయో అంత ద్రిష్టి వుందని ఈ కర్పూర ద్రిష్టి కొలత. అయినా నాకు తెలియక అడుగుతాను! కన్నార్పకుండా అలా ఏదయినా వస్తువుని ఏకాగ్రతతో చూస్తుంటే మండడం లేదా నీరు రావడం అనేది సహజంగా జరిగే విషయమేగా!  మరి దానికి ద్రిష్టి అని పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం??

మంత్రం-కర్పూరం: కర్పూరంతో కొన్ని ట్రిక్కులు కూడా చేయవచ్చు. పూర్వం మంత్రగాళ్లు ఎవరితోనైనా నిజం చెప్పించాలన్నా, ఎదుట వాళ్లను మభ్యపెట్టాలన్నా కర్పూరాన్ని వాడేవారుట. ఆకుకు సన్నరంధ్రాలు చేసి దానిపై కర్పూరాన్ని ఉంచినప్పుడు ఆకు నీటిపై ఒక చోట నుంచి వేరే చోటికి వెళితే అబద్ధం చెప్పాడని, స్థిరంగా ఉంటే నిజం చెప్పాడని నమ్మించే వారు. అయితే దీని వెనుక ఉన్న కిటుకు ఏమిటంటే కర్పూరానికి నీటిలో తేలికగా కరిగే గుణం ఉండటం వలన నీటి తలతన్యత (Surface tension) తగ్గి నీరు అధిక తలతన్యత గల ప్రాంతం నుంచి అల్ప తలతన్యత గల ప్రాంతానికి ప్రయాణించటం వల్ల కర్పూరం ఉంచిన ఆకు లేదా కాగితం పడవ న్యూటన్ 3వ సూత్రం ప్రకారం కర్పూరం ఉన్న కాగితం నిశ్చల స్థితిలో ఉండదు గనుక, నీరు వెనక్కు కదిలినప్పుడు ముందుకు వెళ్తుంది.

తమిళ సామెత-కర్పూరం: అల్పచిత్తునికి ఉదాత్త విషయాలు తెలియవు అని చెప్పే ప్రక్రియలో మనం వాడే సామెతలు  'గాడిదకేం తెలుసు గంథంపొడి వాసన', పందికేం తెలుసు పాండ్స్ పౌడరు వాసన, పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ మొదలయినవి. ఇదే అంశాన్ని ప్రతిబింబిస్తూ తమిళంలో 'కళుదైక్కు తెరియుమూ కర్పూర వాసనై' ( గాడిదకు తెలియునా కర్పూర వాసన) అనే రూపంలో కనిపిస్తుంది.

ఆరోగ్యం-కర్పూరం: దీని వలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:
    1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
    2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది
    3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
    4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
    5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది
    6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
    7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది
    8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.   
    9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.  
    10. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
    11. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. 
    12. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
    13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.
    14. పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.
    15. తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
    16. పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.
    17. కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
    18. అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు. 
    19. కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.
    20. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట

    కర్పూరం అనేది సహజసిద్ధమైన ఉత్పత్తి అయినప్పటికీ మితిమీరి వాడుట వలన అది విడుదల చేసే ఆవిర్లు విషపూరితమైనవి. కనుక కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏదేమయినా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కర్పూర వాసన, ఆహ్లాదం ఆస్వాదించిన వారికే తెలుస్తుంది. ఏమంటారు?

    Tuesday, September 20, 2011

    సోడా సందేహం



    ఏంటండీ అలా చూస్తున్నారు? మనుషులకి వచ్చే సందేహాలనే తీర్చలేక పోతుంటే మళ్ళీ ఈ సోడాలకి కూడా సందేహాలు రావాలా అనుకుంటున్నారా? సోడా సందేహం అంటే సోడాకి కలిగిన సందేహం కాదు సోడా గురించి నాకు కలిగిన సందేహం అనమాట!

    నేను ఆరవ తరగతి చదువుకునే రోజుల్లో ఒక రోజు మా మాష్టారు మన వంటికి ఆక్సిజను మంచిదనీ కార్బన్‌డయాక్సైడ్ మంచిది కాదనీ, అనారోగ్యం కలుగుతుందనీ అందుకే మనం ఊపిరి తీసుకునేటప్పుడు దానిని వదిలేస్తామని చెప్పారు. సరే బాగుంది అనుకుని కార్బన్‌డయాక్సైడ్ మంచిది కాదు అని గట్టిగా ఫిక్స్ అయిపోయా. సరిగ్గా అదే రోజున ఇంకో మాష్టారు వచ్చి ఈ కార్బన్‌డయాక్సైడ్ని నీళ్ళల్లో కలపగా వచ్చే ద్రవమే  మనం తాగే సోడా అని చెప్పారు. అందుకే నేను అసలు స్కూల్కి వెళ్ళను మొఱ్ఱో ఆ మాష్టార్లకి ఏమీ రాదు అని  మొఱపెట్టి మరీ మొత్తుకునేదానిని! కానీ మా ఇంట్లో వాళ్ళు వింటేగా! ఏమిటో నా లాంటి వాళ్ళని అయోమయంలో పడేయడానికే ఇలాంటి విషయాలు చెప్తారు కాబోసు! ఒకాయన వచ్చి మంచిది కాదు అంటాడు ఇంకో ఆయన వచ్చి అది మంచిది తాగండి అంటాడు. అసలు నాకు తెలియక అడుగుతాను అంత మంచిదయితే మన శరీరంలో తయారయిన ఈ కార్బన్‌డయాక్సైడ్ మన శరీరంలోని నీటితో కలిసినపుడు తయారయిన సోడా ఎంచక్కగా మన ఒంటిలోనే ఉంటుంది కదా  మళ్ళీ కొత్తగా కొనుక్కుని మరీ తాగడం ఎందుకు? అసలు ఉన్న ఈ కార్బన్‌డయాక్సైడ్ని బయటకి పంపేసుకోవడమెందుకు? అన్నది నా సందేహం. అది వెంటనే మా మాష్టారు గారిని అడిగితే ఒక్క నవ్వు నవ్వి జారుకున్నారు కాని సమాధానం మాత్రం చెప్పలేదు. ఈ పెద్ద వాళ్ళు ఉన్నారే ఏమడిగినా ఒక నవ్వు నవ్వేసి  వెళ్ళిపోతారు కానీ మనం అడిగినది ఏదీ చెప్పరు. 

    ఇహ వీళ్ళతో కాదులే అని ఇంటికెళ్ళి అమ్మని అడిగా ఆలోచించి అప్పుడు చెప్పింది అలా అవి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కలవవు వాటిని మనం కష్టపడి కలపాలి అప్పుడే దానికి (కార్బన్‌డయాక్సైడ్) ఉన్న చెడ్డ గుణాలు పోయి మంచిగా మారి మనకి జీర్ణ వ్యవస్థపై చక్కని ప్రభావం చూపిస్తుంది అని చెప్పింది. రోజూ తాగే సోడా వెనకాల ఇంక తెరవెనుక కథ (flashback story ) ఉందని తెలిసి నా ఆలోచనలకి తెర తెరుచుకుంది. అప్పుడే దాని గురించి ఆసక్తికరమయిన ఎన్నో విషయాలు తెలుసుకున్నా!

    జర్మనీలో పుట్టి, లండన్‌లో పెరిగి, భారతదేశంలో 70 ఏళ్ల క్రితం అడుగుపెట్టిన గోలీసోడాకు 120 ఏళ్ల చరిత్ర ఉందంటే నమ్మశక్యం కాదు. తొలినాళ్లలో (కాణి) పైసాన్నర ధర ఉండే గోలీసోడా నేడు అయిదు నుండి పది రూపాయలు పలుకుతోంది. ఇప్పటికీ కొందరు కడుపు ఉబ్బరంగా ఉంటే ముందుగా సోడా తాగుతారు. అప్పట్లో జర్మనీలో తయారైన సోడా సీసాలు  మన దేశానికి దిగుమతయ్యేవి. ఇప్పుడు మన దేశంలోనే సీసాలను తయారు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని కంపెనీలు ఈ గోలిసోడా ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. సోడాగ్యాస్‌లో ఉండే కార్బన్‌డయాక్సైడ్‌  గ్యాస్‌ సిలిండర్లను ఉయ్యూరు చక్కెర కర్మాగారం, విశాఖపట్నంలోని ఎరువుల కర్మాగారాలు ఉత్పత్తి చేసేవి. వాటర్‌ ప్యాకెట్లు వచ్చిన తరువాత పట్టణాల్లో కనుమరుగవుతున్నా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో వేసవి సీజన్‌లో సోడా వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతీ కిళ్లీ దుకాణాల్లోనూ ఇవి లభించేవి.  అలాగే వీధుల్లో సోడాలను బళ్లపై వేసుకుని సాయంత్రం పూట అమ్ముకుని జీవనోపాధి పొందేవారు.

    పట్నం నించి మా బంధువులు ఎవరొచ్చినా సోడా కోసం తపించిపోయేవారు. రోజూ తాగే నాకు కొంచెం విచిత్రంగా అనిపించేది. ఇప్పటికీ మా ఊరిలో ఐసు సోడా, నిమ్మకాయ సోడా, నిమ్మఉప్పు సోడా, రస్నా సోడా, ఆరంజి సోడా, పన్నీరు సోడా, సుగంధి సోడా అమ్ముతారు. కాని మునుపటిలా బండ్ల మీద వేసుకుని రావడం లేదు. గోలీ సోడాతో చేసే నిమ్మసోడా రుచి మరే పానియానికి లభించందంటే అతిశయోక్తి లేదు. వయసుతో పని లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తాగే పానీయం సోడానే. ఎంత  ఆభివృద్ధి చెంది ఎన్ని కొత్తరకాల పానీయాలు వచ్చినా సోడాలు మాత్రం జనాల హృదయాల్లో సుస్థిరమయిన స్థానాన్ని పొందాయి. ఒక్క సారి సోడా రుచి మరిగిన వాడు దానికి దాసోహం అనక తప్పదు. 

    వేసవి తాపాన్ని తీర్చే ఐస్ సోడా
    నోరూరించే నిమ్మ సోడా
    సువాసనల సుగంధి సోడా
    ఆనందించే ఆరంజి సోడా
    పులకింపచేసే పన్నీరు సోడా
    రసభరితమయిన రస్నా సోడా
    రోజూ తాగితే ఏదో ఒక సోడా
    మనసవుతుంది ఠండా ఠండా
    కోరుతూనే ఉంటారు థోడా థోడా 

    సోడా గురించి అద్భుతముగా ఈ పాట లో చెప్పారు. అది విన్నాక నేను సోడా మీద చాలా పేరడీ పాటలు పాడటం మొదలుపెట్టాను. మచ్చుకకి రెండు:

    ౧. నీళ్ళంటే నీళ్ళూ కాదు
        గ్యాస్ అంటే గ్యాసూ కాదు
        రెంటినీ కలిపిన సోడానే ఇది సోడానే ఇది. 


    ౨. గోలీ అంటే సులువు కాదులే
         అది నీవు కొట్టలేవులే
         గోలీ అంటే గట్టిగుంటది
         అందరూ కొట్టలేనిది
         చూడ్డానికి చిన్నగుంటది
         కొట్టావా నొప్పి పుడతదీ
        నో నో నో అలా చెప్పకు
        మనసుంటే మార్గముంటది

        సై అంటే కొట్టి చూపుతా
        గోలీ సోడానే కొట్టి తెచ్చెద

        నా బలముని రుజువు చేసెద. 

    దాహం తీర్చుకోడానికి, కడుపుబ్బరం తగ్గించుకోడానికీ తాగే ఈ సోడాలతో ఫైట్లు కూడా చేయచ్చు. స్నేహితులకి ఎవరికయినా కొంచెం మందమయిన కళ్ళద్దాలు ఉంటే సోడాబుడ్డీ అని ఆటపట్టించచ్చు. అందులోని గోలీని కొట్టడం భలే సరదాగా ఉంటుంది కదూ! నేను పట్టు వదలని రసజ్ఞ లాగా (అబ్బాయిలని అయితే విక్రమార్కుడు అనాలి, అమ్మాయిలని అయితే రసజ్ఞ అనే అనాలి)  వేలితో గోలీ కొడదామని ప్రయత్నం చేస్తున్నా! అన్నట్టు గోలీ సోడా స్త్రీ లింగమా? పుంలింగమా? అనే సందేహం కలిగింది ఒక సారి నాకు. ఎవరిని అడిగినా చెప్పలేదు! ఇహ వీళ్ళని అడిగి ప్రయోజనం లేదని నేనే కనిపెట్టేసాను. సోడా పుంలింగం. ఎందుకంటారా? అబ్బాయిలకి ఉన్నట్టే దీనికి కూడా ఆడమ్స్ ఆపిల్ ఉంటుంది కదా గొంతుకలో అందుకు! అంటే దీని గొంతుకలో గోలీ ఉంటుంది కదా! ఈ విషయం మా మాష్టారు గారికి, మా అమ్మకి చెప్పినా నాకు బిరుదులేమీ ఇవ్వకపోగా కనీసం అభినందన సభ కూడా ఏర్పాటు చేయలేదు! సోడాలాగానే నా కళాత్మక దృష్టికి కూడా ఆదరణ తగ్గిపోయిందిలే అని బాధపడి ఊరుకున్నాను.

    పీయే కృతే వర్ధతయేవ నిత్యం సోడా రసం సర్వ రస ప్రధానం అన్నారు! (ఎవరో కాదు నేనే!). దీనిని  తాగినకొద్దీ  రసాస్వాదన పెరుగుతూనే ఉంటుంది అని దీని అర్ధం. ఆ అర్ధం రాకపోయినా అదే అని పెట్టేసుకోండి మీరు. ఇప్పటికయినా సోడాకీ, నా కళాత్మక దృష్టికీ ఆదరణ లభిస్తుందని కోరుకుంటున్నాను.

    పదండి బయటకు పదండి కొట్టుకు
    పోదాం సోడా తాగడానికి !!!!!!!

    Wednesday, September 14, 2011

    స్నానం చేశారా?


    ఏవండోయ్! కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? అని ఎవరయినా అడిగితే వీళ్ళు ఎంత మార్యాద చేస్తున్నారో! అనిపిస్తుంది మరి ఎవరయినా స్నానం చేశారా? అని అడిగితే ఏమనిపిస్తుంది? అదేం ప్రశ్న తిక్క ప్రశ్న అని అనుకుంటాం. లేకపోతే వెక్కి వెక్కి ఏడిచి వేడి నీళ్ళతో మొఖం కడుక్కునే వాడిలా ఆ అడగడమేమిటి అనిపిస్తుంది. సరే నాకు ముందు ఈ విషయం చెప్పండి! మీలో ఎంత మంది స్నానం యొక్క అనుభూతిని పొందారు? స్నానానికి కూడా అనుభూతా అని అడగకండి. అసలు స్నానాన్ని ఆస్వాదిస్తూ చేస్తే ఉంటుంది మజా ....... మాటల్లో చెప్పలేం బాబు! పొద్దున్నే బద్ధకంగా ఉండే మనకి అలా స్నానం చేస్తూ ఉంటే అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులా, మకరందాన్ని తీసుకుంటున్న తేనెటీగలా, తెల్లవారు ఝామున సూర్యుని నులివెచ్చని కిరణాలలో కరిగే మంచులా, సుతారంగా మేనిని తాకి గిలిగింతలు పెట్టే పిల్లగాలిలా, పసి పాపల బోసి నవ్వులా ఇలా రకరకాలుగా అనిపిస్తుంది కదూ! ఏంటి మీకెప్పుడూ అనిపించలేదా? అయితే ఈ సారి స్నానం చేశాక హడావిడిగా తువ్వాలుతో తుడిచేసుకుని పరుగెత్తేయకండి. స్నానాంతరం శరీరం మీదనించి నీటిబిందువులు గురుత్వాకర్షణకి లోనయి కిందకి కారుతూ ఉంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. ప్రతీ ఒక్కరు అనుభవ పూర్వకంగా తెలుసుకోవలసినదే. ప్రాణం అలా లేచి వస్తుంది క్రొత్త హుషారుతో. జలకాలాటలలో అని పాడుకుంటూ స్నానం చేయడమంటే ఎంత మందికి ఇష్టం ఉండదు చెప్పండి.

    స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తే తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తే మసాజ్లా ఉంటుంది. ఆవిరి స్నానం చేస్తే నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. గులాబీ రేకుల స్నానం చేస్తే చర్మానికి లాలన దొరుకుతుంది. అరోమ స్నానం చేస్తే ఒక క్రొత్త లోకంలో విహరిస్తున్నట్టుంది. ఇలా పలు విధాలుగా అనిపిస్తుంది. అసలు స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి అంటే ఇది పూర్తిగా చదవవలసినదే. 

    మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. వాటిల్లో నేను నేర్చుకున్నవీ, చదివి, విని తెలుసుకున్నవీ అన్నిటినీ క్రూడీకరించి ఇక్కడ రాస్తున్నాను. 

    స్నానాల రకాలు:

    పంచ స్నానాని విప్రాణాం కీర్తితాని మహర్షిభిః |
    ఆగ్నేయం వారుణం బ్రహ్మ్యం వాయవ్యం దివ్యమేవచ || 
    అన్నట్టుగా స్నానాలని అయిదు విధములుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును.

    స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధములు. అవి

    నిత్య స్నానం : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.

    నైమిత్తిక స్నానం : ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను పట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం. ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికమన్నమాట.

    కామ్య స్నానం : ఒక కోరికతో చేసేది కామ్య స్నానం. తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.

    స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు. అవి 

    ముఖ్య స్నానం : ఇది నీటిని ఉపయోగించి చేసేది (ఏంటండీ అలా చూస్తున్నారు? స్నానం నీటితో కాక ఇంక దేనితో చేస్తారు అనా? అయ్యో అక్కడకి వస్తాను కాని శాంతంగా ముందు ఇది చదవండి). ఇది మళ్ళీ రెండు రకాలు 
    • మంత్రం లేదా బ్రాహ్మ్యం : వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం". మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.

      "ఓం ఆపోహిష్టామ యోభువః
      తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
      యోవశ్శివతమోరసః
      తస్య భాజయతేహనః
      ఉశతీరివ మాతరః 
      తస్మారంగా మామవో
      యస్యక్షయాయ చ తనః
      ఆపో జన యధాచనః

      అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.
    • వారుణం :  ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "electro-magnetic activity” అంటారు. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశ్యం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.
    అముఖ్యం లేదా గౌణ స్నానం : నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు (మీరు చదివినది నిజమే! నీరు లేకుండా కూడా స్నానం చేయచ్చు). ఇది అయిదు రకాలు 
    • ఆగ్నేయస్నానం : హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. అదెక్కడి స్నానం అనుకుంటున్నారా? చెప్తాను వినండి కాదు రాస్తాను చదవండి. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.

    "శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
    లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||" 

    పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను అని  ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.
    • భౌమస్నానం : పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం". దీనినే mud bath  అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చేట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే  క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.
    • వాయవ్యస్నానం : ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.
    • దివ్యస్నానం : లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది. అవకాశం వస్తే వదలకండి.
    • మానసిక స్నానం : అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది.

    ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం| అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం||
    శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం| ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం||
    త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని| చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం||
    తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం| తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:||
    ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:| సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం||
    యోనిత్యమాచరేద్దేవం సవియెనారాయణ స్మృత:| కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:||

    అంటే పరమాకాశంలో ఉండే పురుషోత్తముడయిన వాసుదేవుడిని, నాలుగు భుజములు కలవాడిని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను  ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాద పద్మముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై పడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేశించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉండి మృత్యువును దాటగలరు. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది అని దీని భావము.

    ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా| తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ||
    జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే| య:స్నాతి మానసే తీర్ధే సయాతి పరమాం గతిం||
    అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:| ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం||
    నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:| సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా||
    బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్| ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభసేత్||
    ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్| సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:||

    ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి. రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావించి నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించి తరించాలి అని దీని భావము.

    ఇహ మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం. ఇది కనీసం నెలకి రెండు సార్లయినా అందరూ చేయాలి! మరి దాని వలన ప్రయోజనాలేమిటో  చూద్దాం -

    1. వేడినీటి స్నానం చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది.

    2. సౌనా పేరుతో నేడు చేయబడే స్టీం బాత్ లు చర్మకణాలను పూర్తిగా శుభ్రపరచి, చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి.

    3. శరీర వెనుక భాగ చర్మం, పిరుదులు, భుజాలు, మొదలైనవి గట్టిగా వుంటాయి. వేడినీరు తగిలితే ఆ భాగాల లోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి. ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది.

    4. వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనెను ఇచ్చి మెత్తబడేట్ల చేస్తుంది. నూనెతో మర్దన, పసుపు శనగపిండిలతో కూడిన పేస్టు రోగాలను తెచ్చే క్రిములను నశింపజేస్తుంది. చర్మం దురదలు, మంట తగ్గుతాయి. అపుడపుడూ అభ్యంగన స్నానం చేస్తే, మైండ్ చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా వుంటుంది. వేడినీటిలో సువాసన ద్రవ్యాలు వేస్తే అవి చర్మానికి సహజ కాంతి నిచ్చి చెడు వాసనలను పోగొడతాయి.
     

    ఇవే కాక నేతితో స్నానం చేయుట వలన ఆయుర్దాయం పెరుగుతుంది; పెరుగు, ఆవుపేడతో స్నానం చేయుట వలన లక్ష్మీ వర్ధనము; దర్భలతో చేయుట వలన సర్వ పాపాలు తొలగుతాయి; సర్వ గంధాలతోటి స్నానం చేస్తే సౌభాగ్యము, ఆరోగ్యము అభివృద్ది చెందుతాయి; ఆమలక స్నానము అంటే ఉసిరికాయని వేసి చేసిన స్నానం వలన దారిద్ర్యాలు తొలగుతాయి; నువ్వులు మరియు తెల్ల ఆవాలతో చేసిన స్నానం అమంగళనివారకము; నువ్వులతో కాని తెల్ల ఆవాలతో కాని ప్రియంగువుతో కాని స్నానం చేస్తే సౌభాగ్య వర్ధనము; మోదుగ, మారేడాకులు, రెల్లు, తామర, కలువ, కడిమి పువ్వులతో స్నానం చేస్తే లక్ష్మీ వర్ధనమే కాక శుభప్రదం; నవరత్నాలతో స్నానము చేస్తే యుద్ధ విజయం; బంగారము వేసిన నీటితో స్నానం చేస్తే ఆయుష్షు, మేధా శక్తి పెరుగుతాయి అని రక రకాల స్నానముల వలన కలిగే ఫలితాలను గురించి శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణములో చెప్పబడింది.  

    ఇప్పుడు ఎవరయినా మీ దగ్గరకి వచ్చి స్నానం చేశారా అని అడిగితే ఏం చెప్తారు? జంధ్యాల గారి చిత్రాలలో సుత్తి వీరభద్రరావు లాగా ఏం స్నానం? నీళ్ళ స్నానమా? బూడిద స్నానమా? మట్టి స్నానమా? తొట్టి స్నానమా? గాలి స్నానమా? ఎండ స్నానమా? వాన స్నానమా? మనసు స్నానమా? పూల స్నానమా? పూల రేకుల స్నానమా? అని అడగచ్చు పొరపాటున అవతలి వ్యక్తి నీళ్ళ స్నానం మహాప్రభో అని అంటే మళ్ళీ వేడి నీటి స్నానమా? చన్నీటి స్నానమా? పన్నీటి స్నానమా? కన్నీటి స్నానమా? మంచి నీటి స్నానమా? ఉప్పునీటి స్నానమా? బావి నీటి స్నానమా? గోతి నీటి స్నానమా? బోరింగు పంపు నీటి స్నానమా? కుళాయి నీటి స్నానమా? అంటూ అడిగిన వాళ్ళకి తలంటు పోసేయచ్చు. అది సంగతి ఇహ మీరు చెలరేగిపోతారని నాకు తెలుసుగా!